V6 News

హాఫ్ సెంచరీలతో చెలరేగిన కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్.. ఆర్సీబీపై ఢిల్లీ గ్రాండ్ విక్టరీ

హాఫ్ సెంచరీలతో చెలరేగిన కేఎల్ రాహుల్, ట్రిస్టన్ స్టబ్స్.. ఆర్సీబీపై ఢిల్లీ గ్రాండ్ విక్టరీ

RCB vs DC: బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మంచి ఊపుమీదున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకి ఢిల్లీ క్యాపిటల్స్ గట్టి షాకిచ్చింది. ఉత్కంఠ పోరులో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ఆర్సీబీ ఫ్యాన్స్‌ను సైలెంట్ చేసింది. 176 పరుగుల లక్ష్య ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు క్లాస్, మాస్ ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోయారు. లక్ష్య ఛేదనలో ఢిల్లీకి ఆరంభంలోనే చుక్కలు కనిపించాయి. భువనేశ్వర్ కుమార్ తన స్వింగ్‌తో మాయ చేస్తూ ఓపెనర్ నిస్సంక(1)ను, సమీర్ రిజ్వీ(2)ని పెవిలియన్ పంపాడు. కరుణ్ నాయర్(5) కూడా ఫెయిల్ అవ్వడంతో.. కేవలం 18 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ టైమ్‌లో ఆర్సీబీ గెలుపు ఖాయమని అందరూ ఫిక్స్ అయ్యారు.

రాహుల్ ‘బర్త్‌డే’ ట్రీట్.. స్టబ్స్ పవర్: 
కష్టాల్లో ఉన్న జట్టును బర్త్‌డే బాయ్ కేఎల్ రాహుల్ తన క్లాసీ బ్యాటింగ్‌తో ఆదుకున్నాడు. మరోవైపు ట్రిస్టన్ స్టబ్స్ ధాటిగా ఆడుతూ ఆర్సీబీ బౌలర్లపై దండయాత్ర చేశాడు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలతో చెలరేగి స్కోర్ బోర్డును ఉరుకులు పెట్టించారు. రాహుల్ హాఫ్ సెంచరీ తర్వాత అవుటైనా, అప్పటికే మ్యాచ్ ఢిల్లీ చేతుల్లోకి వచ్చేసింది. కాగా మ్యాచ్ మధ్యలో అక్షర్ పటేల్ కండరాల నొప్పితో (Retired Hurt) వెనుదిరగడం కాస్త టెన్షన్ పెట్టింది. అయితే క్రీజులోకి వచ్చిన డేవిడ్ మిల్లర్ అసలైన మ్యాజిక్ చేశాడు. చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరమైన తరుణంలో.. రోమారియో షెపర్డ్ బౌలింగ్‌లో వరుసగా రెండు భారీ సిక్సర్లు బాదిన మిల్లర్, మ్యాచ్‌ను కిరాక్ స్టైల్‌లో ఫినిష్ చేశాడు. 

ఇక ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి కీలకమైన 3 వికెట్లు పడగొట్టినప్పటికీ, హేజిల్‌వుడ్, సుయాష్ శర్మ భారీగా పరుగులు సమర్పించుకోవడం దెబ్బతీసింది. చిన్నస్వామిలో ఆర్సీబీ బౌలర్లు మొదట్లో మెరిసినా, చివర్లో ‘కిల్లర్’ మిల్లర్ ముందు తలవంచక తప్పలేదు. అంతకుముందు కుల్దీప్, అక్షర్ ఆర్సీబీని 175 పరుగులకే కట్టడి చేయడం విజయానికి పునాది వేసింది.