భార్యకు ఇంటి పనులు చెప్పడం గృహ హింస కాదు:బాంబే హైకోర్టు తీర్పు

భార్యకు ఇంటి పనులు చెప్పడం గృహ హింస కాదు:బాంబే హైకోర్టు తీర్పు

ముంబై: ఇంటి పనులు చెయ్యాలంటూ పెండ్లి అయిన మహిళకు అత్తింటి వాళ్లు చెప్పడం గృహ హింస (డొమెస్టిక్ వయెలెన్స్) కాదని బాంబే హైకోర్టు తేల్చిచెప్పింది. కుటుంబం కోసం ఇంట్లో పనులు చెయ్యాలన్నంత మాత్రాన ఆమెను పని మనిషిగా చూస్తున్నారని భావించరాదని స్పష్టం చేసింది. భర్త, అత్తామామలపై ఓ మహిళ వేసిన డొమెస్టిక్ వయెలెన్స్ కేసును కోర్టు ఇటీవల కొట్టివేసింది. పెండ్లయిన కొత్తలో తనను భర్త, అత్తామామలు బాగానే చూసుకున్నారని, కానీ ఒక నెల తర్వాత తనను పని మనిషిగా చూడటం, వేధించడం మొదలుపెట్టారంటూ ఓ మహిళ పెట్టిన కేసును హైకోర్టు జడ్జిలు జస్టిస్ విభా కంకణ్ వాది, జస్టిస్ రాజేశ్ పాటిల్ విచారించారు.

అత్తింటి వాళ్లు తనను సూటిపోటి మాటలతో వేధించారని, శారీరకంగా హింసించారని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొంది. అలాగే ఫోర్ వీలర్ కొనేందుకు రూ. 4 లక్షలు తేవాలంటూ వేధించారని కూడా కంప్లయింట్ చేసింది. దీనిపై కోర్టు స్పందిస్తూ.. గృహ హింసకు పాల్పడ్డారని కేవలం మాటల ద్వారా చెప్తే ఐపీసీ సెక్షన్ 498ఏ ప్రకారం చెల్లదని, జరిగిన హింసను ఆధారాలతో సహా వివరించాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. ఇంట్లో పనులు చేయకూడదనుకుంటే పెండ్లికి ముందే ఆ విషయం చెప్తే.. అత్తింటి వాళ్లే తగిన నిర్ణయం తీసుకునే వారని కోర్టు తెలిపింది. పెండ్లి తర్వాత అయినా ఈ విషయంపై వెంటనే చర్చించి ఇరు పక్షాలు ఒక నిర్ణయానికి వచ్చి ఉండాల్సిందని పేర్కొంది. భర్త, అత్తామామలు దాఖలు చేసిన పిటిషన్ ను సమర్థిస్తూ.. కేసును కొట్టేసింది.