రామప్ప పరిసరాల్లో అభివృద్ధిపై మంత్రుల పరిశీలన

రామప్ప పరిసరాల్లో అభివృద్ధిపై మంత్రుల పరిశీలన
  • రామప్ప రామలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్
  • ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే సీతక్క, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు

ములుగు జిల్లా: రామప్ప దేవాలయాన్ని మంత్రులు శ్రీనివాస్ గౌడ్,  ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే సీతక్క,  ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపి కవిత, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, కలెక్టర్, ఇతర శాఖల అధికారులు సందర్శించారు. రామప్ప రామలింగేశ్వరుడికి  ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు  మంత్రులు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రామప్పకు యునెస్కో గుర్తింపుతో ములుగు జిల్లా పర్యాటకంగా అభివృద్ది సాధించడంతో ఉపాధి పెరుగుతుందన్నారు. వందల వేల సంవత్సరాల మన  ప్రాంతంలోని చక్రవర్తులను భాషను, సంస్కృతిని గుర్తింపు తీసుకు వస్తున్నామన్నారు. యునెస్కో గుర్తింపు పొంది  వరల్డ్ హెరిటేజ్ మ్యాప్ లో చోటు సంపాధించుకున్న  అటవీ ప్రాంతంలోని రామప్ప గుడి వల్ల మన పూర్వీకుల జీవితాలు దానివెకన దాగి ఉన్నాయని తెలిపారు. కట్టింది రాజైనా .. ఆ నాటి సైన్యాధిపతులు, వారి కింద పనిచేసిన సైనికులు,  ఆ నాటి ప్రజల కష్టం ఎలా ఉందో ఆలయ శైలి చూస్తేనే అర్థం అవుతుందన్నారు. 
తాజ్ మహల్ లా గుర్తించి ఉంటే వరంగల్ బతుకులు మారేవి
 గత పాలకులు యునెస్కో గుర్తింపు కోసం ఏమాత్రం ప్రయత్నం చేయలేదని,  తాజ్ మహల్ లా ఆనాడే  గుర్తించినట్లయితే వరంగల్ బతుకులు మారేవని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఏమి లేదని మేమే వచ్చి చేశామని  నాటి పాలకులు భ్రమలు కల్పించారని ఆయన విమర్శించారు. తెలంగాణ వచ్చాక సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ వస్తున్నామని, రామప్ప కు యునెస్కో గుర్తింపు కోసం ప్రభుత్వం రెండేళ్లుగా చేసిన కృషి ఫలిచిందన్నారు. రామప్ప పరిసర ప్రాంతాల్లో  చేపట్టాల్సిన  అభివృద్ది కోసం సీఎం సూచనతో పరిశీలనకు వచ్చామన్నారు. కేంద్రానికి పన్నులు కోట్ల రూపాయలు కడుతున్నాం... చాలా రాష్ట్రాల్లో కట్టిన పన్నులకంటే ఎక్కువ వస్తుందని, మనకు కూడా ఏదో రూపంలో రాష్ట్రానికి నిధులు ఇస్తే సంతోషిస్తామన్నారు. 
రామప్ప ప్రాంతంలో అభివృద్ధి కోసం ప్రతిపాధనలు చేసి కేంద్రప్రభుత్వానికి పంపిస్తాం 
రామప్ప దేవాలయం ప్రాంతంలో చేపట్టాల్సిన అభివృద్ధి గురించి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపిస్తామని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. విదేశీ పర్యటకులకు కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామన్నారు. గత మూడు నాలుగేళ్లుగా 7 కోట్లు ఖర్చు చేశామని మరో 15 కోట్లతో ప్రతిపాధనలు సిద్దం చేశామన్నారు. రామప్ప తో పాటు సమాంతరంగా ఉన్న వేయిస్తంబాలు దేవాలయాలు,  ఫోర్ట్ వరంగల్ ఇతర టెంపుల్స్, లేక్స్ తో కాకతీయ హెరిటేజ్ సర్క్యూట్  చేయాలన్న ఆలోచన చేస్తున్నామన్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునే ముందు త్వరలోనే జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులతో హైదరాబాద్ లో  మీటింగ్ పెడతామన్నారు. ఈ ప్రాంత పరిరక్షణ కోసం నిబంధనలకు విరుద్దంగా ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆయన సూచించారు. ప్రపంచ వారసత్వ గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం పరిసరాల్లో అభివృద్ది పనులకు ప్రజలు సహకరించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ కోరారు. 
గుర్తింపు రావడానికి కృషి చేసిన అందరికీ కృతజ్ఞతలు: మంత్రి ఎర్రబెల్లి
రామప్ప కు యునెస్కో గుర్తింపు రావడంలో రష్యా లీడ్ తీసుకుందని.. మద్దతిచ్చిన 17 దేశాలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ప్రపంచ వారసత్వ సంపద జాబితాలో చేటు సంపాధించడంలో కృషిచేసిన కేంద్ర ప్రభుత్వానికి , స్వచ్చంద సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దేవాలయ ప్రతిష్ట, ఎలా పునాది కట్టారు? ఆలయ చరిత్ర , ఆలయ నిర్మాణ తీరు పై సీఎం కేసీఆర్ రాసిన లేఖ దేశాల మద్దతుకు ఉపయోగపడిందన్నారు. రామప్ప గుర్తింపుతో ఈ ప్రాంతాన్ని టూరిజం హబ్ గా మార్చే బాధ్యత కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలపై ఉందన్నారు. ఎమ్మెల్యే సీతక్క తోపాటు సర్పంచ్ లు , ప్రజాప్రతినిధులు, అధికారులు ఐక్యాంగా సహకరించాలన్నారు. ప్రభుత్వ భూమితోపాటు సీడ్ కార్పోరేషన్ భూమి ఉంది, రైతులు, గ్రామస్తులు సహకరించాలన్నారు. ఎవరికీ అన్యాయం చేయమని ఆయన స్పష్టం చేశారు. రామప్ప ప్రాంతంలో డబుల్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ ,  ఇతర నిర్మాణాలకు ప్రతిపాధనలు ఇస్తే సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. 
రామప్పను పర్యాటక కేంద్రంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం: మంత్రి సత్యవతి రాథోడ్
రామప్పను పర్యాటక కేంద్రంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని మంత్రి సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు. కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ఏర్పాటు చేసి పాండురంగారావు, పాపారావు ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. రామప్పకు వచ్చి పోవడం కాకుండా పర్యాటక కేంద్రంగా అన్ని రకాలుగా డెవలప్ చేస్తామని, ప్రపంచ స్థాయిలో నిలబెట్టుకునే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. 
టూరిజం హబ్ గా అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్యే సీతక్క  
ఈ ప్రాంతాన్ని  టూరిజం హబ్ గా అభివృద్ది చేయాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు. కాకతీయలు రాజులుగా ఈ ప్రాంత సామంత రాజులుగా సమ్మక్క, సారలమ్మ పరిపాలనలో రామప్ప లాంటి  నిర్మాణాలు జరిగాయన్నారు. కాకతీయులు ఎక్కడ ఉన్నా టెంపుల్  టౌన్ కు ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇన్నేళ్ల తర్వాత రామప్పకు యునెస్కో  గుర్తింపు రావడానకి కృషిచేసిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు. రామప్పను అంతర్జాతీయ గుర్తింపు కోసం ప్రొఫెసర్ పాండు రంగారావు, పాపారావు చేసిన కృషి ఎనలేనదన్నారు. లక్నవరం దగ్గర పురాతన గుడి, పాకల దగ్గర  రామక్క టెంపుల్ లా ఉంది, వాటిని అభివృద్ది చేయాలన్నారు. రామప్ప కు సమీపంలోని గుట్టల మద్య ఉన్న ఇంచెం చెరువును అభివృద్ది చేస్తే పర్యాటకంగా మారుతుందన్నారు. ఇక్కడ తలమానికం లాంటి వన సంపద, కాకతీయల చరిత్రను కాపాడుకుంటూ భవిష్యత్ తరాలకు అందిస్తామన్నారు. భవిష్యత్ లో జరిగే అభివృద్ది కోసం భూసేకరణ లో బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలన్నారు.