ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా

ఎప్​సెట్​లో పూలే గురుకుల విద్యార్థుల హవా

హైదరాబాద్, వెలుగు :  ఎప్​సెట్ 2024 ఫలితాల్లో మహాత్మా జ్యోతి బాపూలే బీసీ  గురుకుల విద్యార్థులు అత్యధిక ర్యాంకులు సాధించి సత్తా చాటారు. అగ్రికల్చర్ విభాగంలో స్ఫూర్తి అనే విద్యార్థిని 369వ ర్యాంకు సాధించింది. ఇంజినీరింగ్, మెడికల్, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎప్​సెట్  పరీక్షలో అగ్రికల్చర్  విభాగంలో అత్యధిక మంది ర్యాంకులు పొందారు. అగ్రికల్చర్  విభాగంలో మొత్తం 145 మంది బాలికలు పరీక్ష రాయగా వారిలో 114 మంది అర్హత సాధించారు. 12 మందికి ఐదువేల లోపు ర్యాంకులు, 29 మందికి పదివేల లోపు ర్యాంకులు వచ్చాయి. ఇంజినీరింగ్  విభాగంలో 276 మంది బాలికలు పరీక్ష రాయగా వారిలో ఇద్దరు పదివేల లోపు ర్యాంక్ సాధించారు. 191 మంది అర్హత సాధించారు. 135 మంది బాలురు పరీక్ష రాయగా వారిలో 5 మంది బాలురు పదివేల లోపు ర్యాంకులు సాధించారు. 107 మంది క్వాలిఫై అయ్యారు.   

అభినందించిన పొన్నం

ఎప్​సెట్ లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్  ఓ ప్రకటనలో అభినందనలు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులు మరిన్ని ర్యాంకులు పొందేలా ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించాలని సిబ్బందికి ఆయన సూచించారు. విద్యార్థులు మరింత కష్టపడి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలన్నారు. ఇప్పటికే గ్రీన్ చానెల్  ద్వారా మెస్ చార్జీలు చెల్లించే విధంగా తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. బీసీ గురుకుల పాఠశాలలకు, హాస్టళ్లకు పక్కా భవనాలు నిర్మించేందుకు కేబినెట్  ఇప్పటికే అంగీకరించిందని మంత్రి గుర్తుచేశారు.