బాహుబలి పానీపూరి : నోరు పట్టాలి కదయ్యా

బాహుబలి పానీపూరి : నోరు పట్టాలి కదయ్యా

పానీ పూరి..దేశంలో ఏ స్ట్రీట్ ఫుడ్కు లేని ఫ్యాన్స్..ఈ పానీపూరికి ఉంటారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పానీపూరిని పిలుస్తారు.  గోల్గప్పా అని ఒకచోట..మరో చోట పుచ్కా, ఇంకోచోట బటాషే, ఓ ప్రాంతంలో గప్ చుప్ అంటూ ఇష్టంగా పిలుచుకుంటారు. పేర్లేవైనా...ప్రాంతాలు వేరైనా పానీపూరి మాత్రం ఒక్కటే. అయితే ఇన్నాళ్లు పానీపూరి అంటే ఒక చేతిలో ఇమిడే విధంగా చిన్నగా ఉండేది...కానీ మహారాష్ట్రలో ఓ పానీపూరి విక్రేత..విభిన్నమైన పానీపూరితో ఆకట్టుకుంటున్నాడు. నాగ్‌పూర్‌లోని పానీపూరి అమ్మే ఓ వ్యాపారి..బాహుబలి పానీ పూరిని చాట్ ప్రేమికులకు అందిస్తున్నాడు. ఈ బాహుబలి పానీపూరీ  ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. 

బాహుబలి పానీపూరి ఎలా తయారు చేస్తారంటే..

నాగ్‌పూర్‌లో బాహుబలి పానీ పూరి తయారీ చాలా ఆసక్తికరంగా ఉంది. ముందుగా పెద్ద-పరిమాణ పూరీలో విక్రేత...చింతపండు చట్నీ వేస్తాడు. ఆ  తర్వాత నార్మల్ వాటర్ ను పోస్తాడు. కొద్దిగా నారింజ -రుచిగల పానీ పోస్తాడు. అనంతరం జీరా  పానీ, వెల్లుల్లి పానీతో పూరిని నింపుతాడు. అనంతరం బంగాళాదుంప సగ్గుబియ్యాన్ని పూరిలో టవర్ ఆకారంలో ఏర్పాటు చేస్తాడు. దానిపై పెరుగు, బూందీ  చల్లుతాడు.. అదే బాహుబలి పానీపూరి.

ఈ బాహుబలి పానీపూరి తయారీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుడ్ పేజీ ది క్రేవింగ్స్ టేల్ షేర్ చేసింది. దీన్ని లక్షల మంది వీక్షించారు.  82K కంటే ఎక్కువ మంది లైక్ చేశారు.