డుప్లెసిస్ కెప్టెన్సీలో ఆర్సీబీ టైటిల్ నెగ్గేనా?

డుప్లెసిస్ కెప్టెన్సీలో ఆర్సీబీ టైటిల్ నెగ్గేనా?

 ‘ఈ సాల కప్ నమదే’ (ఈసారి కప్‌‌‌‌ మాదే)..  ప్రతి ఐపీఎల్ సీజన్ కు ముందు, లీగ్ సమయంలోనూ రాయల్‌‌ చాలెంజర్స్​ బెంగళూరు (ఆర్‌‌సీబీ) అభిమానుల నినాదం.  అన్ని జట్లలోకెల్లా బలంగా ఉండే ఈ టీమ్ పై ఫ్యాన్స్ గంపెడు ఆశలు పెట్టుకోవడం.. వారేమో కీలక సమయాల్లో చేతులెత్తేసి టైటిల్ కల నెరవేర్చుకోకుండానే ఇంటిదారి పట్టడం.. ప్రతిసారి ఇదే తంతు.  విరాట్ కోహ్లీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం, ఈ టీమ్ పెద్దన్న ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆర్‌‌సీబీ ఈ సారి కొంచెం కల తప్పినట్లుగా కనిపిస్తోంది. ఈ ఏడాది మెగావేలంలో జట్టులోకి వచ్చిన డుప్లెసిస్​కు కెప్టెన్సీ ఇచ్చిన మేనేజ్ మెంట్.. ఈసారైనా టైటిల్ సాధించాలని ఆశిస్తోంది. చివరగా 2016లో ఫైనల్ వరకు వెళ్లిన ఆర్‌‌సీబీ.. ఆ తర్వాత మూడేళ్లు కనీసం ప్లేఆఫ్స్ కూడా చేరలేకపోయింది. కానీ గత రెండు సీజన్లలో ప్లేఆఫ్స్‌‌ వరకు వచ్చినా.. లక్ష్యాన్ని అందుకోలేదు. దీంతో ఈ ఏడాదైనా తమ టీమ్ ట్రోఫీ సాధిస్తే చూడాలని ప్రతి ఫ్యాన్ కోరుకుంటున్నాడు. ఈ నెల 27న పంజాబ్ తో  జరిగే మ్యాచ్​తో  ఆర్‌‌సీబీ కొత్త సీజన్‌‌ను ప్రారంభించనుంది.

బలాలు

ప్రతిసారి బ్యాటింగ్ బలంతో బరిలో దిగే ఆర్‌‌సీబీఈసారి మాత్రం బౌలింగ్ డిపార్ట్ మెంట్ లో కాస్త బలంగా కనిపిస్తోంది. వేలానికి ముందు జెమీసన్ ను వదులుకున్న ఫ్రాంచైజీ  అతడి ప్లేస్ లో మరో పొడగరి హేజిల్‌‌వుడ్ ను తీసుకుంది. తను లాస్ట్ సీజన్ లో చెన్నై టీమ్ విక్టరీతో పాటు గతేడాది ఆస్ట్రేలియా టీ20 వరల్డ్ కప్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అతడికి తోడు నిరుడు పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్  పటేల్ ఈసారి కూడా కీలకం కానున్నాడు. ఇక సిరాజ్, సిద్దార్థ్ కౌల్ రూపంలో మరో ఇద్దరు ఇండియా బౌలర్లు, బెరెండార్ఫ్‌‌, డేవిడ్ విల్లే రూపంలో ఫారిన్ పేసర్లు ఉండనే ఉన్నారు. స్పిన్‌‌లో నంబర్ వన్ ఆల్ రౌండర్ వానిందు హసరంగ మంచి ఆప్షన్ గా కనిపిస్తున్నాడు. అలాగే షాబాజ్‌‌ అహ్మద్, కర్ణ్ శర్మ, లామ్రోర్ వంటి ఇండియా స్పిన్నర్లతో పాటు మ్యాక్స్‌‌వెల్ కూడా తన బంతితో మాయ చేయగలగడం ఈ టీమ్ కు ప్లస్ అనొచ్చు.

బలహీనతలు

ఇన్నేళ్లు బ్యాటింగ్ లో కోహ్లీ, డివిలియర్స్ పైనే ఎక్కువగా ఆధారపడ్డ బెంగళూరు ఈసారి మిస్టర్ 360 లేకుండానే బరిలో దిగుతోంది. ఇక కోహ్లీ కొంతకాలంగా సరైన ఫామ్ లో లేకపోవడం టీమ్‌‌కు మైనస్. కెప్టెన్సీ వదులుకున్న కోహ్లీ స్వేచ్ఛగా బ్యాట్ కు పని చెబితేనే టీమ్ పెర్ఫామెన్స్ ఓ తీరుగా ఉంటుంది. లేదంటే టాపార్డర్ లో డుప్లెసిస్, మిడిల్ లో నిరుడు బాగా ఆడిన మ్యాక్స్‌‌వెల్‌‌తో పాటు కొత్తగా వచ్చిన దినేశ్ కార్తీక్ లపై ఎక్కువ భారం పడుతుంది.  అదే టైమ్‌‌లో 3, 5 నంబర్లలో బ్యాటింగ్ చేసే ప్లేయర్లు ఎవరనేదానిపై ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యంగ్ ప్లేయర్ అనూజ్ రావత్ వన్‌‌డౌన్‌‌లో వచ్చే చాన్సున్నా.. కీలకమైన ఆ ప్లేస్ లో అతడు ఏమాత్రం రాణిస్తాడన్నది ప్రశ్న. లోమ్రోర్ లేదా కార్తీక్ ఐదో నంబర్‌‌లో రావొచ్చు. అయితే, ఇద్దరిలో పెద్దగా నిలకడ లేకపోవడం టీమ్ ను ఆందోళనలో పడేస్తోంది. మొత్తంగా ఆర్​సీబీ మిడిల్​ డల్​గా ఉంది.

ఆర్‌‌సీబీ టీమ్

ఇండియన్స్: విరాట్‌‌ కోహ్లీ, అనూజ్, దినేశ్ కార్తీక్, సిసోడియా, అనీశ్వర్, హర్షల్, మహిపాల్ లామ్రోర్, షాబాజ్‌‌, ప్రభుదేశాయ్, ఆకాశ్ దీప్, సీవీ మిలింద్, కర్ణ్ శర్మ, సిరాజ్, సిద్దార్థ్ కౌల్.
ఫారిన్ ప్లేయర్లు : డుప్లెసిస్ (కెప్టెన్), హేజిల్‌‌వుడ్, బెరెండార్ఫ్‌‌, హసరంగ, డేవిడ్ విల్లే, మ్యాక్స్‌‌వెల్, ఫిన్ అలెన్.

ఎవరితో ఎన్ని మ్యాచ్ లు 

గ్రూప్‑బిలో ఉన్న బెంగళూరు అదే గ్రూప్ లోని చెన్నై, హైదరాబాద్, పంజాబ్, గుజరాత్ తో పాటు గ్రూప్–ఎలోని రాజస్థాన్ తో రెండేసి మ్యాచ్ లు ఆడుతుంది. ముంబై, కోల్ కతా, ఢిల్లీ, లక్నోలతో ఒక్కో మ్యాచ్ లో తలపడుతుంది.