వచ్చేది కాంగ్రెస్‌‌ ప్రభుత్వమే : రేవంత్

వచ్చేది కాంగ్రెస్‌‌ ప్రభుత్వమే : రేవంత్

హైదరాబాద్‌‌, వెలుగు:  రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, సోనియా, ప్రియాంకా అండదండలతో, మల్లికార్జున ఖర్గే ఆదేశాలతో ముందుకు పోతున్నామని పీసీసీ చీఫ్​ రేవంత్‌‌రెడ్డి అన్నారు.  సోమవారం సరూర్‌‌నగర్‌‌  స్టేడియంలో నిర్వహించిన ‘యువ సంఘర్షణ’ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘60 ఏండ్లు పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఆకాంక్షలు నెరవేరలేదు. ఆకాంక్షలు నెరవేరక నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నరు. వారికి అండగా నిలబడటానికి సోనియా బిడ్డ ప్రియాంకా గాంధీ తెలంగాణ గడ్డ మీద కాలుపెట్టారు” అని తెలిపారు.

తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి చాటిన వేదికలు ఓయూ, కేయూ అని పేర్కొన్నారు. ‘‘మా కొలువులు మాగ్గావాలె అనే ఒకే ఒక్క ఆకాంక్ష తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపింది. నిప్పుకణికలుగా లాఠీలకు, తూటాలకు ఎదురొడ్డి యువత పోరాడారు. కానీ, కేసీఆర్ పాలనలో యువతకు న్యాయం జరగడం లేదు” అని ఆయన అన్నారు. 

కేసీఆర్​ సర్కార్​లో న్యాయం జరగదు

ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాల సంఖ్య 12.5 లక్షలు అని, విభజన టైమ్‌‌లో తెలంగాణకు 5.3 లక్షలు కేటాయిం చారని రేవంత్​ తెలిపారు. రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాది 1.07 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని కేసీఆర్‌‌ మాటిచ్చి తర్వాత మరిచిపోయారని ఆయన మండిపడ్డారు.  2020 బిశ్వాల్‌‌ కమిటీ లక్షా 91 వేల 126 ఖాళీలు ఉన్నాయని  నివేదిక ఇచ్చినా బీఆర్​ఎస్​ సర్కారు ఉద్యోగాలను భర్తీ చేయలేదన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌‌ రెడ్డి.. యూత్ డిక్లరేషన్‌‌ను ప్రవేశపెట్టారు. సభలో కాంగ్రెస్  రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ మాణిక్ రావు ఠాక్రే, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, నేతలు వి.హనుమంతరావు, అజహరుద్దీన్‌‌, పొన్నాల లక్ష్మయ్య, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌‌కుమార్‌‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీకాంతాచారికి నివాళులు

సభకు ముందు పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఎల్బీ నగర్​లోని శ్రీకాంతాచారి విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించారు. అక్కడి నుంచి పాదయాత్రగా సరూర్​నగర్​ స్టేడియానికి చేరుకున్నారు.