టోక్యో పారాలింపిక్స్ లో ఫైనల్ కు చేరిన భావినా బెన్ పటేల్

టోక్యో పారాలింపిక్స్ లో ఫైనల్ కు చేరిన భావినా బెన్ పటేల్

టోక్యో: పారాలింపిక్స్ టేబుల్ టెన్నిస్ లో భారత ప్యాడ్లర్ భావినా బెన్ పటేల్ ఫైనల్ కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ ఫైనల్  పోరులో చైనాకు చెందిన జాంగ్ మియావోపై  3 - 2  తేడాతో విజయం సాధించింది. ప్రిక్వార్టర్స్ లో మాదిరిగానే హోరా హోరీగా సాగిన ఈ మ్యాచులో చైనా క్రీడాకారిణి జాంగ్ మియావోపై  7..11, 11..7, 11..4, 9..11, 11..18 తేడాతో గెలిచి ఫైనల్ కు దూసుకెళ్లడమే కాదు.. భారత్ కు ఒక పతకాన్ని ఖరారు చేసింది.  
గుజరాత్ రాష్ట్రంలోని గాంధీనగర్ కు చెందిన భావినా బెన్ పటేల్ తన చిన్నతనంలో అంటే 12 నెలల వయసులో ఉన్నప్పుడే పోలియో బారిన పడింది. చికిత్స చేయించినా రెండు కాళ్లు అచేతనంగా మారిపోవడంతో ఆమె తండ్రి అహ్మాదాబాద్ లోని బ్లైండ్ పీపుల్ అసోసియేషన్ లో చేర్పించాడు. క్రీడల్లో చురుగ్గా ఉండే ఈ అసోసియేషన్ లో భావినా బెన్ పటేల్ టేబుల్ టెన్నిస్ కోచ్ లలన్ దోషి వద్ద శిక్షణ తీసుకుంది. టేబుల్ టెన్నిస్ లో అంచలంచలుగా ఎదిగినా చదువును ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా దూర విద్యద్వారా డిగ్రీ పూర్తి చేసింది.