రష్యా గ్యాస్ సప్లైకి  ఉక్రెయిన్​ బ్రేక్​

రష్యా గ్యాస్ సప్లైకి  ఉక్రెయిన్​ బ్రేక్​

యూరప్​కు చేసే సరఫరాలో 25% ఎఫెక్ట్​
కీవ్/మాస్కో: రష్యా నుంచి యూరప్ కు నేచురల్ గ్యాస్ ను సప్లై చేస్తున్న ఓ పైప్ లైన్​లో సరఫరాను అడ్డుకున్నట్లు బుధవారం ఉక్రెయిన్ ప్రకటించింది. గ్యాస్ సరఫరాను ఆపేయడం నిజమేనని, దీనివల్ల కొంత ప్రభావం కూడా పడిందని రష్యన్ ప్రభుత్వ కంపెనీ గాజ్ ప్రామ్ తెలిపింది. అంతకుముందు రోజు కంటే యూరప్ కు గ్యాస్ సప్లై 25% తగ్గినట్లు పేర్కొంది. మరోవైపు ఈశాన్య ప్రాంతంలోని ఖార్కివ్ సిటీకి సమీపంలో నాలుగు గ్రామాల నుంచి రష్యన్ బలగాలను పారదోలి, తిరిగి స్వాధీనం చేసుకున్నామని ఉక్రెయిన్ వెల్లడించింది. స్టేరీ సాల్టివ్ గ్రామాన్ని తిరిగి స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ బలగాలు మరో ఆరు మైళ్లు ముందుకు వెళ్లాయని, ప్రస్తుతం బార్డర్ కు మరో 10 మైళ్ల దూరంలోనే ఉన్నాయని తెలిపింది. 
 

ఖార్కివ్ లో ముందుకెళ్తున్నం: జెలెన్ స్కీ 
ఉక్రెయిన్ లో రెండో అతిపెద్ద సిటీ అయిన ఖార్కివ్ కు సమీపంలో నాలుగు గ్రామాలను తిరిగి తమ కంట్రోల్ లోకి తెచ్చుకున్నామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వొలోదిమిర్ జెలెన్ స్కీ వెల్లడించారు. రష్యన్ సేనలను క్రమంగా ఖార్కివ్ నుంచి తరిమికొడుతున్నామని అన్నారు.  
 

స్నేక్ ఐల్యాండ్ లో హోరాహోరీ
నల్లసముద్రంలోని స్నేక్ ఐల్యాండ్​లో సెటిలైన రష్యన్ బలగాలపై ఉక్రెయిన్ సైన్యం దాడులు కొనసాగిస్తోందని బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది. సముద్రంలో రష్యా ప్రభావాన్ని తగ్గించేందుకు దీటుగా పోరాటం చేస్తోందని పేర్కొంది. అయితే, నల్లసముద్రంలో ఇప్పటికే రెండు కీలకమైన యుద్ధ నౌకలను కోల్పోయిన రష్యా.. ఒడెస్సా పోర్టు సిటీపై మళ్లీ దాడులు చేసింది.  ఒడెస్సా నుంచి మరియుపోల్ మీదుగా డాన్​బాస్ వరకూ కారిడార్​ను ఏర్పాటు చేసుకునే లక్ష్యంతో 
రష్యా దాడులు కొనసాగిస్తోంది. 
 

రష్యాకు 40% ట్యాంకులు లాస్ 
రష్యన్ ట్యాంకులను ఉక్రెయిన్ బలగాలు వరుసగా పేల్చివేస్తున్నాయి. రష్యాకు చెందిన అధునాతన టీ 90ఎం ట్యాంకును కూడా రాకెట్ లాంచర్​తో పేల్చేసిన వీడియో ఫుటేజీని ఉక్రెయిన్ బుధవారం విడుదల చేసింది. ఖార్కివ్​కు సమీపంలోని స్టేరీ సాల్టివ్ వద్ద ట్యాంకును పేల్చేసినట్లు వెల్లడించింది. ‘‘మోడ్రన్ టెక్నాలజీతో  రష్యా తయారు చేసుకున్న రూ.38 కోట్ల విలువైన టీ90ఎం యుద్ధట్యాంకును.. జస్ట్ రూ.17 లక్షల విలువైన స్వీడిష్ రాకెట్ లాంచర్​తో పేల్చివేశాం” అని పేర్కొంటూ ఉక్రెయిన్ రక్షణ శాఖ వీడియో ఫుటేజీ విడుదల చేసింది. ఇప్పటివరకు యుద్ధంలో 1,170 రష్యన్ యుద్ధట్యాంకులను పేల్చేశామని, రష్యా వద్ద ఉన్న మొత్తం ట్యాంకుల్లో ఇవి 40% అని తెలిపింది.