కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేసిన ఎమ్మెల్యే  రాజగోపాల్ రెడ్డి

నల్లగొండ : మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇంచార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.  నార్కట్ పల్లి మండలంలో తన సొంత గ్రామం బ్రాహ్మణ వెల్లంలలో కుటుంబసభ్యులతో కలిసి రాజగోపాల్ రెడ్డి ఓటు చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి ప్రజలలో మంచి స్పందన ఉందని చెప్పారు.  ఈ రోజు వాతావరణం కూడా ఓటింగ్ సరళి పెరగడానికి అనుకూలంగా ఉందన్నారు.  ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకుంటే మంచి పాలన అందించవచ్చని చెప్పారు. ఈవీఎంలను సీరియల్ లో పెట్టకపోవడంపై యాదాద్రి జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసామని తెలిపారు. 

 ఎన్నికల విధులలో పాల్గొన్న అధికారులకు, పోలీసులకు అభినందనలు తెలియజేస్తున్నానని రాజగోపాల్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ గెలుపు  కోసం పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి కృతజ్ఞతలు తెలుపుతున్నానని చెప్పారు.  గతంలో ఈ ప్రాంతం కోసం తాను చేసిన సేవలే భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.