యాదాద్రి నరసింహుడి వార్షిక‌‌‌‌ బ్రహ్మోత్సవాలు... ఘనంగా యాదగిరీశుడి చక్రస్నానం

యాదాద్రి నరసింహుడి వార్షిక‌‌‌‌ బ్రహ్మోత్సవాలు... ఘనంగా యాదగిరీశుడి చక్రస్నానం
  • ఉదయం మహాపూర్ణాహుతి, చక్రతీర్థం
  • ఫిబ్రవరి 28న ముగియనున్న వార్షిక‌‌‌‌ బ్రహ్మోత్సవాలు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు చివరి అంకానికి చేరుకున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదో రోజైన శుక్రవారం ఉదయం ప్రధానార్చకులు కాండూరి వెంకటాచార్యులు, సురేంద్రాచార్యుల ఆధ్వర్యంలో యాగశాలలో మహాపూర్ణాహుతి నిర్వహించారు.

అనంతరం స్వామివారికి చక్రతీర్థం ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా చేపట్టారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేక అలంకారంలో మాఢవీధుల్లో ఊరేగించారు. భక్తుల కేరింతలు, యువకుల నృత్య ప్రదర్శనల నడుమ స్వామివారిని విష్ణుపుష్కరిణి వరకు తీసుకొచ్చారు.

అక్కడ లక్ష్మీనరసింహులకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం శ్రీమహావిష్ణువు ప్రధాన ఆయుధమైన ‘మహా సుదర్శన చక్ర ఆళ్వార్‌‌‌‌’కు పుష్కరిణిలో చక్రతీర్థ స్నానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎండోమెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ హనుమంతరావు, ఆలయ ఈవో భవానీ శంకర్, చైర్మన్‌‌‌‌ నరసింహమూర్తి సైతం భక్తులతో కలిసి పుష్కరిణిలో స్నానాలు చేశారు.

సాయంత్రం 6 గంటలకు ప్రధానాలయ ముఖమండపంలో లక్ష్మీనరసింహులను దశావతార స్తోత్రాలతో స్తుతిస్తూ స్వామివారికి శ్రీపుష్పయాగం నిర్వహించారు. అనంతరం దేవతోద్వాసన, దోపు ఉత్సవాలు జరిపారు. ఆయా కార్యక్రమాల్లో ఎండోమెంట్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ హనుమంతరావు, ఆలయ చైర్మన్‌‌‌‌ నరసింహమూర్తి, ఈవో భవానీ శంకర్‌‌‌‌, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌‌‌‌శర్మ పాల్గొన్నారు.

ఫిబ్రవరి 28తో  బ్రహ్మోత్సవాలు ముగింపు

యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదకొండో రోజైన శనివారం ఉదయం స్వామివారికి అష్టోత్తర శతఘటాభిషేకం, రాత్రి శృంగార డోల్సోత్సవం నిర్వహించనున్నారు. దీంతో 11 రోజులుగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు 
పరిసమాప్తి కానున్నాయి.