రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం.. నాంపల్లి పీఎస్కు తరలించిన పోలీసులు

రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం.. నాంపల్లి పీఎస్కు తరలించిన పోలీసులు

హైదరాబాద్‌: రాహుల్ గాంధీ అరెస్ట్ను నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న నిరసనలతో నాంపల్లి బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఆఫీస్‌ ముట్టడికి కాంగ్రెస్‌ నేతలు యత్నించారు. కాంగ్రెస్‌ నేతలు రాకుండా బీజేపీ నేతలు కర్రలతో అడ్డుకున్నారు.

మరోపక్క.. రాజ్ భవన్ ముట్టడికి యత్నించిన టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులను పోలీసులు నాంపల్లి పీఎస్కు తరలించారు. కార్మిక శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి నాంపల్లి పీఎస్కు చేరుకున్నారు. రాహుల్ గాంధీ అరెస్ట్ను ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఖైరతాబాద్‌లో కూడా కాంగ్రెస్ ఆందోళనకు దిగింది. నెక్లెస్ రోడ్డులోని ఐమాక్స్ సమీపంలో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం దగ్గరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

లోక్ భవన్ ముట్టడికి యత్నించిన పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఘటనా స్థలంలో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.