న్యూఢిల్లీ: నీట్ పేపర్ లీక్‌కు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొన్న యువతులపై పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు అనుచితంగా ప్రవర్తించడంపై యూపీ మాజీ సీఎం, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఫైర్ అయ్యారు. బుధవారం (జులై 22) లోక్ సభలో ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యను ఆయన తీవ్రంగా ఖండించారు.
సీజేపీ నిరసనకారులపై పోలీసులు జరిపిన అణచివేతపై ప్రధాని మోడీ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల మాట వినకపోతే.. వారు వీధుల్లోకి వస్తారని హెచ్చరించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తోన్న విద్యార్థులపై పోలీసులు క్రూరంగా దాడి చేశారని.. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
పోలీసులు మహిళా నిరసనకారుల బట్టలు చింపేశారని.. రక్తం వచ్చేలా విద్యార్థినులను లాఠీలతో కొట్టారని ఆరోపించారు. పోలీసుల దాడిలో పలువురి చేతులు, కాళ్లు విరిగాయని మండిపడ్డారు. సివిల్ దుస్తుల్లో వచ్చిన కొందరు వ్యక్తులు పోలీసుల ముసుగులో విద్యార్థులను దారుణంగా కొట్టారని.. ఎలక్ట్రిక్ లాఠీలను కూడా ఉపయోగించారని ఆరోపించారు.
►ALSO READ | రాజ్ భవన్ ముట్టడికి కాంగ్రెస్ నేతల యత్నం.. నాంపల్లి పీఎస్కు తరలించిన పోలీసులు
మన దేశ విద్యార్థినులతో ఇలాగేనా ప్రవర్తించేది..? నిరసన తెలుపుతోన్న ఆడబిడ్డల బట్టలు చింపేస్తారా..? అని కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. నీట్ పేపర్ లీక్ అంశంపై ప్రధాని మోడీ పార్లమెంట్ బయట మాట్లాడుతున్నారని.. కానీ సభలో ఎందుకు ప్రకటన చేయడం లేదని నిలదీశారు. నీట్ పేపర్ లీక్ పై పార్లమెంట్ లో ప్రకటన చేసేందుకు నిరాకరించడంతోనే మంగళవారం (జులై 21) ప్రధాని మోడీ నివాసాన్ని ముట్టడించామని తెలిపారు.
