ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల అరెస్ట్‌ను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ క్రమంలో కరీంనగర్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
కేంద్రమంత్రి బండి సంజయ్ ఇంటిని ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలివెళ్లగా... వారిని బీజేపీ నాయకులు, కార్యకర్తలు తీవ్రంగా అడ్డుకున్నారు. చేతుల్లో కర్రలతో బండి సంజయ్ ఇంటికి బీజేపీ నేతలు కాపలాగా నిలవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.
ఈ క్రమంలో బీజేపీ నేతలపై కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు, చెప్పులతో దాడులకు తెగబడ్డారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో కరీంనగర్ వీధులు రణరంగాన్ని తలపించాయి.
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు లాఠీలకు పనిచెప్పారు. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను చెదరగొట్టి, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
ఇదిలా ఉండగా... కాంగ్రెస్ దాడికి నిరసనగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించేందుకు బీజేపీ శ్రేణులు యత్నించాయి. అయితే వారిని కాంగ్రెస్ నేతలు అడ్డుకోవడంతో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రెండు ప్రధాన పార్టీల సవాల్-ప్రతిసవాల్‌తో కరీంనగర్‌లో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.
