టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ క్రిప్టో ప్రపంచంలో భారీ అడుగు వేస్తున్నట్లు ప్రకటించారు. ఈ వేసవిలో టెలిగ్రామ్ యాప్‌లోనే నేరుగా పనిచేసే నాన్-కస్టోడియల్ క్రిప్టో వాలెట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 100 కోట్లకు పైగా నెలవారీ యాక్టివ్ యూజర్లకు తక్షణం, ఎలాంటి ఫీజు లేకుండా క్రిప్టో లావాదేవీలు చేసే అవకాశం కల్పించడమే ఈ ప్రాజెక్ట్ లక్ష్యమని దురోవ్ వెల్లడించారు.
నాన్-కస్టోడియల్ వాలెట్ అంటే వినియోగదారుల క్రిప్టో ఆస్తులపై పూర్తి నియంత్రణ వారికే ఉంటుంది. ప్రైవేట్ కీలు యూజర్ల దగ్గరే ఉండటంతో.. వారి అనుమతి లేకుండా థర్డ్ పార్టీలు వాటిని ఫ్రీజ్ చేయటం, స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాదు. ప్రస్తుతం ఉన్న కొన్ని క్రిప్టో వాలెట్లలో కంపెనీలే వినియోగదారుల ఆస్తులను నిర్వహిస్తాయి. కానీ టెలిగ్రామ్ కొత్త వాలెట్‌లో ఈ నియంత్రణ నేరుగా యూజర్లకే ఉండనుంది.
🌍 This summer will see the largest rollout of a non-custodial crypto wallet in human history.
— Pavel Durov (@durov) July 21, 2026
⚡️Instant zero-fee crypto transactions for over a billion users are about to become reality.
We're bringing a native non-custodial Gram wallet to every Telegram app! 💎
టెలిగ్రామ్ ఇప్పటికే @wallet అనే క్రిప్టో వాలెట్ బాట్‌ను అందిస్తోంది. దీన్ని దాదాపు 15 కోట్ల మంది ఉపయోగిస్తున్నారు. అయితే అది డిఫాల్ట్‌గా కస్టోడియల్ విధానంలో పనిచేస్తుంది. కొత్తగా రాబోయే వాలెట్ మాత్రం టెలిగ్రామ్ యాప్‌లోనే అంతర్భాగంగా.. మొదటి నుంచే నాన్-కస్టోడియల్ విధానంలో పనిచేయనుంది. అయితే ఇది ప్రస్తుత @wallet స్థానాన్ని భర్తీ చేస్తుందా లేదా దానితో పాటు కొనసాగుతుందా అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
ఈ ప్రకటన తర్వాత టెలిగ్రామ్ క్రిప్టో నెట్‌వర్క్‌కు చెందిన గ్రామ్(Gram) టోకెన్ ధరలో పెరుగుదల కనిపించింది. దాదాపు 7 శాతం పెరిగి 1.52 డాలర్లకు చేరుకుంది. ఈ క్రిప్టో ప్రాజెక్ట్‌కు గతంలో వివాదాలు కూడా ఎదురయ్యాయి. 2018లో టెలిగ్రామ్ ప్రారంభించిన గ్రామ్ ప్రాజెక్ట్ కోసం 1.7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సమీకరించింది. అయితే అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ అభ్యంతరాల తర్వాత 2020లో టెలిగ్రామ్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. అనంతరం డెవలపర్లు నెట్‌వర్క్‌ను కొనసాగించారు. ఇప్పుడు టెలిగ్రామ్ మళ్లీ క్రిప్టో సేవలను విస్తరించడంతో డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో ఈ ప్లాట్‌ఫామ్ పాత్ర మరింత పెరిగే అవకాశం కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.
