ఇక డెంగ్యూకి గుడ్ బై: మొట్టమొదటి వ్యాక్సిన్ వచ్చేసింది.. 4 నుండి 60 ఏళ్ల వాళ్ళు తీసుకోవచ్చు...

ఇక డెంగ్యూకి గుడ్ బై: మొట్టమొదటి వ్యాక్సిన్ వచ్చేసింది.. 4 నుండి 60 ఏళ్ల వాళ్ళు తీసుకోవచ్చు...

డెంగ్యూ వ్యాధి నివారణ & నియంత్రణలో భారతదేశం ఒక కీలకమైన అడుగు వేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO), దేశంలోనే మొట్టమొదటి డెంగ్యూ వ్యాక్సిన్ అయిన ‘క్యూడెంగా’ (Qdenga)కు మార్కెటింగ్ అనుమతి మంజూరు చేసింది. ఈ టీకాను జర్మనీకి చెందిన ‘టకేడా GmbH’ కంపెనీ తయారు చేయగా, భారత్‌లో ‘టకేడా బయోఫార్మాస్యూటికల్స్ ఇండియా’ సంస్థ దిగుమతి చేసుకోనుంది.

ఈ వ్యాక్సిన్‌ ఎవరికి ఇస్తారు ?
4 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయస్సు ఉన్నవారు ఈ టీకా తీసుకోవచ్చు. ప్రతీ డోస్ 0.5 ml చొప్పున మొత్తం రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. మొదటి డోస్ తీసుకున్న 3 నెలల తర్వాత రెండో డోస్ ఇస్తారు. దీనిని ఇంజెక్షన్‌గా ఇస్తారు.

భద్రత & పరీక్షలు
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 1940 నాటి డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం ప్రకారం ఈ టీకా నాణ్యత, సమర్థత, భద్రతలను శాస్త్రీయంగా పరిశీలించిన తర్వాతే అనుమతులు ఇచ్చారు. భారత్‌తో పాటు బ్రెజిల్, థాయ్‌లాండ్, శ్రీలంక వంటి 8కి పైగా దేశాల్లో క్లినికల్ ప్రయోగాలు నిర్వహించారు.

మన దేశంలో కూడా 4 నుండి 60 ఏళ్ల మధ్య ఉన్నవారిపై మూడో దశ (Phase-III) ప్రయోగాలు పూర్తి చేసాక... ఇది సురక్షితమైనదని నిర్ధారించుకున్న తర్వాతే అనుమతి ఇచ్చారు. 

ప్రపంచవ్యాప్తంగా లభించిన గుర్తింపు
ఈ టీకా ఇప్పటికే ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు పొందింది. యూరోపియన్ యూనియన్, బ్రిటన్, స్విట్జర్లాండ్, ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్ సహా 42 దేశాల్లో ఇప్పటికే అందుబాటులో ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కూడా ఈ వ్యాక్సిన్‌కు ఆమోదముద్ర  వేసింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 2.4 కోట్లకు పైగా డోసులను ప్రజలకు అందించారు. ఈ వ్యాక్సిన్‌ వాడిన వారిలో ఇప్పటివరకు ఎటువంటి తీవ్రమైన సైడ్ ఎఫెక్ట్స్ నమోదు కాలేదని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.