బైక్ రిపేర్‌లో నిర్లక్ష్యం.. మెకానిక్‌కు రూ.66 వేలు కోర్టు ఫైన్.. ఎక్కడంటే?

బైక్ రిపేర్‌లో నిర్లక్ష్యం.. మెకానిక్‌కు రూ.66 వేలు కోర్టు ఫైన్.. ఎక్కడంటే?

రోజంతా కష్టపడి సంపాదించే ఓ రోజువారీ కూలీ తన బైక్ రిపేర్ కోసం ఇచ్చిన డబ్బుకు సరైన సర్వీస్ అందకపోవడంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు. చిన్న సమస్యగా మొదలైన బైక్ రిపేర్ వివాదం చివరకు మెకానిక్‌కు భారీ జరిమానాగా మారింది. కేరళలోని కొల్లం జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్.. బైక్ రిపేర్ సరిగ్గా చేయనందుకు సదరు మెకానిక్‌ను బాధ్యుడిగా తేల్చి రూ.66వేల 752 చెల్లించాలని ఆదేశించింది.

తిరువనంతపురానికి చెందిన రోజువారీ కూలీ రెంజిత్ ఆర్‌కు చెందిన హీరో గ్లామర్ బైక్ ఇంజిన్‌లో సమస్య రావడంతో 2025 జూలైలో మెకానిక్ అనిల్‌కుమార్ బి వర్క్‌షాప్‌కు ఇచ్చాడు. మొదట రిపేర్ ఖర్చు రూ.10 వేలు అవుతుందని చెప్పిన మెకానిక్.. తర్వాత రూ.12 వేలు అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. అయితే డబ్బు తీసుకున్న తర్వాత కూడా బైక్ రిపేర్‌ను పూర్తి చేయకుండా పదేపదే ఆలస్యం చేశాడు. వర్క్‌షాప్‌కు పలుమార్లు వెళ్లినా బైక్ ఇప్పతీసి రిపేర్ పూర్తి చేయని స్థితిలోనే కనిపించడంతో రెంజిత్ 8 రోజుల కూలీని కోల్పోయాడు. చివరకు పోలీసుల జోక్యంతో మెకానిక్ బైక్‌ను తిరిగి ఇచ్చాడు. 

మూడు నెలల్లోనే మళ్లీ ఇంజిన్ సమస్య..
ఎలాంటి బిల్లు ఇవ్వకుండానే, ఇకపై ఇంజిన్ లక్ష కిలోమీటర్లు సాఫీగా నడుస్తుందని హామీ ఇచ్చాడు. కానీ ఆ హామీ ఎక్కువ కాలం నిలవలేదు. కేవలం 3 నెలల్లోనే బైక్ 6 వేల కిలోమీటర్లు కూడా తిరగకముందే ఇంజిన్ మళ్లీ పాడైంది. మరో మెకానిక్ పరిశీలించగా క్రాంక్‌షాఫ్ట్ దెబ్బతిన్నట్లు గుర్తించారు. అనంతరం బైక్‌ను మరో గ్యారేజీలో రిపేర్ చేయించేందుకు రెంజిత్ రూ.17వేల 610 ఖర్చు చేశాడు.

కొత్త మెకానిక్ పరిశీలనలో పిస్టన్‌ను తప్పుగా అమర్చడం వల్ల ఇంజిన్‌లో అధికంగా ఆయిల్ కాలిపోవడం, కార్బన్ పేరుకుపోవడం, చివరకు క్రాంక్‌షాఫ్ట్ బేరింగ్ దెబ్బతినడం జరిగిందని తేలింది. డబ్బు తిరిగి ఇవ్వాలని లేదా రిపేర్ ఖర్చు భరించాలని రెంజిత్ కోరినా మెకానిక్ స్పందించకపోవడంతో అతను వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించాడు.

నిర్లక్ష్య సేవగా తేల్చిన కమిషన్..
కమిషన్ విచారణలో మెకానిక్ ఎలాంటి లిఖితపూర్వక సమాధానం ఇవ్వకపోవడంతో.. రెంజిత్ సమర్పించిన ఆధారాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంది. రిపేర్‌లో నిర్లక్ష్యం, బిల్లు ఇవ్వకపోవడం, వాహనాన్ని ఆలస్యంగా అప్పగించడం, ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోవడం వంటివి సేవా లోపంగా పరిగణించింది. రోజువారీ కూలీ అయిన రెంజిత్ ఎదుర్కొన్న ఆర్థిక నష్టం, మానసిక వేదనను గుర్తించిన కమిషన్ రూ.36వేల 752 నష్టపరిహారం, రూ.20వేలు మానసిక వేదనకు, రూ.10వేలు కేసు ఖర్చుల కోసం చెల్లించాలని ఆదేశించింది. మొత్తం రూ.66వేల 752ను 45 రోజుల్లో చెల్లించాలని, ఆలస్యం అయితే 9 శాతం వడ్డీ కలిపి కట్టాల్సి ఉంటుందని కోర్టు తీర్పు నిచ్చింది.