కమ్యూనిజం అంతమైంది..అర్బన్‌‌‌‌ నక్సలైట్లుగా మారేలా స్టూడెంట్లకు నూరిపోస్తున్నరు

కమ్యూనిజం అంతమైంది..అర్బన్‌‌‌‌ నక్సలైట్లుగా మారేలా స్టూడెంట్లకు నూరిపోస్తున్నరు
  •     బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌‌‌‌రావు

నల్గొండ అర్బన్, వెలుగు : ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం అంతమైందని, తెలంగాణలో కూడా దాని ప్రభావం తగ్గిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌‌‌‌.రామచందర్‌‌‌‌రావు అన్నారు. శుక్రవారం నల్గొండలో జరిగిన పండిట్‌‌‌‌ దీన్‌‌‌‌దయాల్‌‌‌‌ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్‌‌‌‌ 2026 కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

కాంగ్రెస్, బీఆర్ఎస్‌‌‌‌కు బీజేపీతో కొట్లాడే శక్తి లేక కమ్యూనిస్టులను పెంచి పోషించి ప్రాణం పోస్తున్నాయని ఆరోపించారు. తుపాకితోనే విప్లవం, మార్పు వస్తుందని నమ్మిన మావోయిస్ట్‌‌‌‌ పార్టీ ఏ విధంగా అంతమైందో తెలుసన్నారు. అర్బన్‌‌‌‌ నక్సలైట్లను తయారు చేసేలా కొందరు వ్యక్తులు యూనివర్సిటీల్లో స్టూడెంట్లకు నూరిపోస్తున్నారని, అలాంటి విధానాలు మానుకొని విద్యార్థులకు బంగారు భవిష్యత్‌‌‌‌ను అందించాలని సూచించారు. 

బీజేపీ కార్యకర్తలు దేశ భవిష్యత్‌‌‌‌లో భాగస్వాములు కావాలని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పని చేయాలని సూచించారు. గ్రామ స్థాయి నుంచే కార్యకర్తలను సైద్ధాంతికంగా బలోపేతం చేయడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్లాస్టిక్‌‌‌‌ నివారణ, స్వదేశీ వస్తువుల వినియోగం వంటి విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. 

బీజేపీ చరిత్ర, సిద్ధాంతాలను తెలుసుకొని పార్టీలో ఏ విధంగా పనిచేయాలో నేర్చుకోవాలని సూచించారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు బీజేపీలోనే ఉంటాయన్నారు. సీపీఎం కూడా క్రమశిక్షణ కలిగిన పార్టీయే.. కానీ వాటిని అమలు చేయడం లేదన్నారు. సాంకేతిక ప్రగతిని సాధించడంతో పాటు బంగారు భారతదేశ నిర్మాణాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేలా బీజేపీ నాయకులు, కార్యకర్తలు 
కృషి చేయాలని చెప్పారు