- 4 బైకులు, 3 సెల్ ఫోన్లు, 2 కేజీల గంజాయి స్వాధీనం
నల్గొండ అర్బన్, వెలుగు : ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న నలుగురు దొంగలను అరెస్టు చేసి నాలుగు బైకులు, మూడు సెల్ ఫోన్లు, 2 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు నల్గొండ డీఎస్పీ కొలను శివరాంరెడ్డి తెలిపారు. బైకుల దొంగతనాల కేసులో నలుగురిని అరెస్టు చేయగా ఒకరు పరారీ లో ఉన్నారన్నారు. శుక్రవారం నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. గత కొంతకాలంగా హైదరాబాద్ నుంచి నల్గొండకు గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ గంజాయి సేవించడంతో పాటు విక్రయిస్తున్న వ్యక్తులు ద్విచక్ర వాహనాల దొంగతనానికి పాల్పడుతున్నారన్నారు. నల్లగొండ పట్టణానికి చెందిన షేక్ సమద్ గత కొంతకాలంగా ప్రైవేట్ కార్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు.
ఈ క్రమంలో అనుముల మండలం మారేపల్లి కి చెందిన గడిదల పవన్, నల్గొండ మండలం నర్సింగ్ బట్ల కు చెందిన నాగిల్ల సంపత్, నల్గొండ పద్మనగర్ చెందిన పెండ్ర పరుశురాం, వివేకానంద నగర్ కు చెందిన కట్ట వెంకటేశ్వర్లు సమద్‌కు పరిచయమయ్యారు. వీరి పరిచయం స్నేహంగా మారడంతో గత ఆరు నెలలుగా మీరు గంజాయి కి అలవాటు పడ్డారు. షేక్ సమద్ హైదరాబాదులో గంజాయి కొనుగోలు చేసి మిగతా నలుగురు స్నేహితులకు ఇవ్వడంతో పాటు చిన్న చిన్న ప్యాకెట్లు చేసి ఒక ప్యాకెట్ రూ. 500 చొప్పున విక్రయిస్తున్నారన్నారు.
వీరందరూ కలిసి బైకులపై శుక్రవారం సాయంత్రం సమయంలో శివాజీ నగర్ చౌరస్తాలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డారన్నారు. సమద్ మోటార్ సైకిల్ పైనుంచి దూకి పారిపోయాడని మిగతా నలుగురైన గడిదల పవన్, నాగిళ్ల సంపత్, పెండ్ర పరుశురాం, కట్ట వెంకటేశ్వర్లును అరెస్టు చేశామన్నారు. విచారణలో వారు నేరం ఒప్పుకోవడంతో వారి నుంచి నాలుగు మోటార్ సైకిల్స్, మూడు సెల్ ఫోన్లు, రెండు కేజీల గంజాయిని రికవరీ చేసి రిమాండ్ కు తరలించామన్నారు.
