భద్రతామండలిలో రిఫామ్స్ తేవాలె.. బ్రిక్స్ దేశాల జాయింట్ స్టేట్ మెంట్ 

భద్రతామండలిలో రిఫామ్స్ తేవాలె.. బ్రిక్స్ దేశాల జాయింట్ స్టేట్ మెంట్ 

జొహెన్నెస్ బర్గ్/న్యూఢిల్లీ: యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ (యూఎన్ఎస్సీ)లో సంస్కరణలు తీసుకురావాలని బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా) దేశాలు కోరాయి. సౌతాఫ్రికాలోని జొహెన్నెస్ బర్గ్ లో 15వ బ్రిక్స్ సమిట్ గురువారం ముగిసింది. అనంతరం బ్రిక్స్ దేశాలు జాయింట్ స్టేట్ మెంట్ విడుదల చేశాయి. యూఎన్ఎస్సీని మరింత డెమొక్రటిక్ గా, రిప్రజెంటేటివ్ గా, ఎఫెక్టివ్ గా మార్చాలని కోరాయి. సెక్యూరిటీ కౌన్సిల్ లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిధ్యం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశాయి. కాగా, బ్రిక్స్ దేశాలు టెర్రరిజాన్ని తీవ్రంగా ఖండించాయి. టెర్రరిజం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నా సహించేది లేదని  పేర్కొన్నాయి. టెర్రరిజాన్ని నిర్మూలించేందుకు కలసికట్టుగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నాయి. 

బ్రిక్స్ కూటమిలోకి కొత్తగా 6 దేశాలు 

బ్రిక్స్ కూటమి విస్తరణకు సభ్య దేశాలు ఓకే చెప్పాయి. కొత్తగా 6 దేశాలను చేర్చుకోవాలని సమిట్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో బ్రిక్స్ కూటమిలోకి కొత్తగా అర్జెంటీనా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యూఏఈ, సౌదీ అరేబియా శాశ్వత సభ్య దేశాలుగా చేరనున్నాయి. వీటి చేరికతో కూటమిలోని దేశాల సంఖ్య 11కు పెరగనుంది. బ్రిక్స్ సమిట్ అనంతరం ప్రధాని మోదీ, చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్, బ్రెజిల్ ప్రెసిడెంట్ లూయిజ్ ఇనాసియోలతో కలిసి సౌతాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రామఫోసా మీడియాతో మాట్లాడారు. ఆరు కొత్త దేశాల సభ్యత్వం 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. ఇదే తరహాలో మరిన్ని దశల్లోనూ కూటమి విస్తరణ ఉంటుందని తెలిపారు.   

మోదీ, జిన్ పింగ్ చర్చలు..  

బ్రిక్స్ సమావేశం సందర్భంగా ప్రధాని మోదీ, చైనా ప్రెసిడెంట్ జిన్ పింగ్ మాట్లాడుకున్నారు. జాయింట్ ప్రెస్ మీట్ కు వెళ్తున్న టైమ్ లో ఇద్దరూ ముచ్చటించుకున్నారు. ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సదస్సు సందర్భంగా ఇరువురు నేతలు ప్రత్యేకంగా భేటీ కూడా అయ్యారు. సరిహద్దులో ఇరువైపులా డీఎస్కలేషన్ (బలగాల ఉపసంహరణ)ను స్పీడప్ చేసేందుకు ఇరువురూ అంగీకరించారని మన ఫారిన్ సెక్రటరీ వినయ్ క్వాత్రా వెల్లడించారు. కాగా, ఇథియోపియా ప్రధాని అబీ అహ్మద్ అలీ, సెనెగల్ ప్రెసిడెంట్ మాకీ సాల్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కూడా మోదీ సమావేశమయ్యారు.