ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ను నిలదీసిన కేంద్ర మంత్రి అమిత్ షా

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ను నిలదీసిన కేంద్ర మంత్రి అమిత్ షా

న్యూఢిల్లీ: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కరెంట్ బిల్లులన్నీ మాఫీ చేస్తామన్న ఆప్ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ హామీపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాల్లో పోటీ చేస్తున్నదని, అలాంటిది దేశ వ్యాప్తంగా కరెంట్ బిల్లులు మాఫీ చేస్తామని ఎట్ల ప్రకటిస్తుందని మండిపడ్డారు. ఇది అయ్యే పనేనా? అని జాతీయ న్యూస్ చానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్ షా నిలదీశారు. ‘‘ఆప్ దేశవ్యాప్తంగా 22 లోక్​సభ స్థానాల్లో పోటీ చేస్తున్నది. గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 270 మంది ఎంపీలు ఉండాలి. 22 స్థానాల్లో పోటీ చేస్తూ.. దేశవ్యాప్తంగా కరెంట్ బిల్లులు మాఫీ చేస్తామని అంటారా? ఎలాంటి గ్యారంటీలు ఇస్తున్నారు మీరు? ఇది సాధ్యమవుతదా? ఆప్ 10 గ్యారంటీల్లో ఏ ఒక్కటి కూడా అమల్లో సాధ్యం కాదు’’ అని అమిత్ షా అన్నారు. 

దర్యాప్తు ఏజెన్సీలు స్వతంత్రంగా పనిచేస్తున్నయ్

దర్యాప్తు ఏజెన్సీలన్నీ స్వతంత్రంగా పని చేస్తున్నాయని అమిత్ షా చెప్పారు. ప్రభుత్వం వాటిని ఏవిధంగానూ మిస్ యూజ్ చేయడంలేదని తెలిపారు. ‘‘దర్యాప్తు ఏజెన్సీలను అడ్డుపెట్టుకుని రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నామని అపోజిషన్ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇందులో నిజం లేదు. కేజ్రీవాల్ ఇలాంటి ఆరోపణలు చేస్తుంటే.. అతను తొమ్మిది సార్లు సమన్లను ధిక్కరించాడు. చివరికి ఎన్నికల టైమ్​లో అధికారులు అరెస్ట్ చేస్తే ఏడుపు మొదలుపెట్టాడు. కేజ్రీవాల్​కు మధ్యంతర బెయిల్ మాత్రమే వచ్చింది. ఎన్నికల ప్రచారానికి  సుప్రీం కోర్టు కొన్ని షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. జూన్​ 2న మళ్లీ తీహార్ జైలుకు తిరిగి పోవాల్సిందే. ఇది అతనికి అనుకూలమైన తీర్పు ఎలా అవుతుంది?’’ అని అన్నారు. 

ఎంత మంది కలిసి వచ్చినా మా విజయం ఖాయం

కాంగ్రెస్, ఆప్ కలిసి వచ్చినా ఢిల్లీలో తమపై ఎలాంటి ప్రభావం ఉండదని అమిత్ షా అన్నారు. తమ ఓటు బ్యాంకు సేఫ్​గానే ఉందని చెప్పారు. ‘2029 దాకా మోదీ ప్రధానిగా ఉంటారు. ఆ తర్వాత బీజేపీ పోలింగ్ క్యాంపెయిన్​ను లీడ్ చేస్తారు. రాహుల్ గాంధీ గొంతు చించుకుని మా పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నడు. రాజ్యాంగం మారుస్తామని, రిజర్వేషన్లు ఎత్తేస్తామంటూ ఇష్టమొచ్చినట్టు కామెంట్లు చేస్తున్నడు. ఎన్డీఏ కూటమికి రెండింట మూడు వంతుల మెజారిటీ ఉంది. రాజ్యాంగాన్ని మార్చాలన్నా.. రిజర్వేషన్లు ఎత్తేయాలన్నా మమ్మల్ని ఎవరు ఆపుతారు? రాహుల్ చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదు’’అని విమర్శించారు. 

సౌత్​లో మెజారిటీ స్థానాలు మావే..

కర్నాటక, ఏపీ, తెలంగాణ, తమిళనాడులలో అత్యధిక స్థానాల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అమిత్​ షా తెలిపారు. ‘ ఈ రాష్ట్రాల్లో 109 ఎంపీ స్థానాలున్నయ్. 2019 ఎన్నికల్లో 29 స్థానాల్లో గెలిచాం. ఈసారి తమిళనాడు, ఏపీతో పాటు కేరళలోనూ ఖాతా తెరుస్తాం. ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు వస్తయ్. యూపీ, ఎంపీ, బిహార్, రాజస్థాన్, హర్యానా, గుజరాత్​లో 200కు పైగా స్థానాల్లో గెలుస్తాం’’ అని తెలిపారు.