ఇండియా కూటమి గెలిస్తే.. జైలునుంచి తెల్లారే బయటికొస్తా: కేజ్రీవాల్​

ఇండియా కూటమి గెలిస్తే.. జైలునుంచి తెల్లారే బయటికొస్తా: కేజ్రీవాల్​

న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే ఆ మరుసటి రోజే తాను జైలు నుంచి బయటకు వచ్చేస్తానని ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​ చెప్పారు. మధ్యంతర బెయిల్ గడువు జూన్ 1 తో ముగుస్తుందని, జూన్ 2న తాను మళ్లీ తీహార్​ జైలుకు వెళ్లాలని తెలిపారు. లోక్ సభ ఎన్నికల ఫలితాలను జైలులో టీవీ ద్వారా తెలుసుకుంటానని కేజ్రీవాల్​ వివరించారు. ఈమేరకు సోమవారం జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) కౌన్సిలర్ల మీటింగ్ లో ఆయన ఈ కామెంట్స్ చేశారు. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తనను తీహార్ జైలుకు పంపించిన విషయం గుర్తుచేస్తూ.. జైలులో తనను కించపరిచేందుకు చాలా ప్రయత్నాలు జరిగాయని చెప్పారు.

తనను ఉంచిన సెల్​ లో రెండు సీసీటీవీ కెమెరాలు అమర్చారని, వాటి ద్వారా మొత్తం 13 మంది ఆఫీసర్లు 24 గంటలూ తనను గమనించేవారని తెలిపారు. ఈ ఫుటేజీని ప్రధాని నరేంద్ర మోదీ కూడా చూస్తూనే ఉన్నారని విశ్వసనీయంగా తెలిసిందన్నారు. ప్రధానికి తనపై ఎందుకంత కక్ష అనేది అర్థంకావడంలేదని కేజ్రీవాల్​ అన్నారు. నిత్యం ప్రజా సేవ చేస్తూ, ప్రజల మనసుల్లో తాను స్థానం సంపాదించుకోవడాన్ని చూసి మోదీ ఓర్వలేకపోతుండవచ్చని విమర్శించారు. ప్రజల అభిమానం చూరగొన్న ఆప్ నేతలను చూసి బీజేపీ భయపడుతోందని, అందుకే తప్పుడు కేసులు పెట్టి తమను వేధిస్తోందని కేజ్రీవాల్​ ఆరోపించారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీలో  మనీలాండరింగ్ ఆరోపణల కింద కేజ్రీవాల్​ అరెస్టైన విషయం తెలిసిందే. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ​ ప్రచారం చేసుకునేందుకు వీలు కల్పిస్తూ సుప్రీం కోర్టు కేజ్రీవాల్​కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అంతకుముందు, ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలతో జరిగిన భేటీలో కేజ్రీవాల్​ మాట్లాడుతూ.. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీని వీడకుండా ఉన్నారంటూ తన ఎమ్మెల్యేలను మెచ్చుకున్నారు. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ మరింత ఐకమత్యంగా, మరింత 
బలంగా తయారైందని కేజ్రీవాల్​ పేర్కొన్నారు.

కేజ్రీవాల్​పై పిటిషన్​ను తోసిపుచ్చిన సుప్రీం

జైలుపాలైన అర్వింద్​ కేజ్రీవాల్​కు సీఎం పదవిలో ఉండే అర్హత లేదని, ఆయనను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్​ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపు చ్చింది. ఈ విషయంలో నిర్ణయాధికారం ఢిల్లీ ఎల్జీ చేతుల్లోనే ఉందని చెప్పింది. ఆ వ్యవహా రంలో జోక్యం చేసుకోవడానికి పిటిషనర్​కు న్యాయపరంగా ఎలాంటి హక్కులేదని స్పష్టంచేసింది. ఈమేరకు జస్టిస్ సంజీవ్​ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన బెంచ్​ ఈ పిటిషన్ తోసిపుచ్చింది.