
- సమస్యల పరిష్కారానికి రూ.2,300 కోట్లు కేటాయింపు
ఇస్లామాబాద్: పాక్ అక్రమిత కాశ్మీర్ (పీవోకే)లోని పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి. పెరిగిన గోధుమ పిండి ధరలు, విద్యుత్ చార్జీలు, పన్నులను నిరసిస్తూ చేపట్టిన సమ్మె సోమవారం నాల్గో రోజుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ జనజీవనం స్తంభించింది. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ పీవోకేలోని పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే సమావేశాన్ని నిర్వహించారు.
ఆ ప్రాంతంలోని సమస్యలు పరిష్కరించేందుకు వెంటనే రూ.2,300 కోట్లు కేటాయించారు. గతంలోనే జమ్మూకాశ్మీర్ జాయింట్అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) సభ్యులు, పీవోకే ప్రాంత కార్యదర్శి దావూద్ బరీచ్ తో చర్చలు జరిపారు. రాయితీపై విద్యుత్తు, గోధుమపిండిని అందించాలని కోరారు. ఈ చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. దీంతో జేఏఏసీ నాయకులు నిరసనలకు పిలుపునిచ్చారు. ముజఫరాబాద్ లాంగ్ మార్చ్ కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వం భారీగా భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేయడంతో ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
ఓ పోలీసాఫీసర్ మరణించారు. డజన్లకొద్దీ వ్యక్తులు అరెస్టయ్యారు. మరో 100 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ హింసాత్మక ఘర్షణలపై ప్రధాని షరీఫ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని ఆదివారం చెప్పారు. ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నాల్లో భాగంగా పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ సంయమనం పాటించాలని కోరారు. చర్చలు, పరస్పర సంప్రదింపుల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు.
రాజకీయ పార్టీలు, సంస్థలు, ఈ ప్రాంత ప్రజలను బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కోరారు. హింసాత్మక ఘటనలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ప్రభుత్వం పీవోకేలోని మొబైల్ ఫోన్, ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. నిరసనల నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాలయాలను సోమవారం మూసివేశారు.