V6 News

మరణించినా.. బతికే ఉంటాడు

మరణించినా.. బతికే ఉంటాడు

ఎయిమ్స్ లో 16 నెలల ఓ బాలుడు అవయవ దానం చేసి అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచాడు. తాను చనిపోతూ మరో ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను కాపాడాడు. రెండు కిడ్నీలను 5ఏళ్ల బాలుడికి, 6 నెలల బాలికకు కాలేయాన్ని  దానం చేశాడు. విధి ఒక్కోసారి విపరీత పరిణామాలను ఎదుర్కొనేలా చేస్తుందనేందుకు ఈ బాలుడి కథే ఉదాహరణ. ఢిల్లీలోని జమునా పార్క్ కి చెందిన 16 నెలల రిషాంత్ అనే బాలుడు అప్పుడప్పుడే అడుగులు వేయడం నేర్చుకుంటున్నాడు. ఇంతలోనే కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన ఆగస్టు 17న జరిగింది. వృత్తిరిత్యా ఓ ప్రైవేటు కాంట్రాక్టర్ గా పనిచేస్తోన్న ఆ బాలుడి తండ్రి సమాచారం తెలుసుకున్న వెంటనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాలుడి తలకు తీవ్ర గాయం కావడంతో కుటుంబసభ్యులు రిషాంత్ ను ఎయిమ్స్ లో చేర్పించారు. అనంతరం ఆగస్టు 24న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

దీంతో ఆ బాలుడి కుటుంబం శోకసంద్రంలోకి మునిగిపోయింది. ORBO, AIIMS  వైద్యులు, మార్పిడి సమన్వయకర్తలు వారికి అవయదానంపై కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం వారి అంగీకారంతో రిషాంత్ అవయవాలు, కణజాలాలను దానం చేశారు. తన కుమారుడు చాలా చిన్న పిల్లవాడని, కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నామని ఆ శిశువు తండ్రి ఉపిందర్ చెప్పారు. రోజూ లాగే ఓ రోజూ తాను పనికి వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగిందని.. చేతులారా తమ కొడుకుని పొగొట్టుకున్నామని ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే ఈ బాలుని అవయవదానం తర్వాత రిషాంత్ రెండు కిడ్నీలను ఎయిమ్స్ లోని 5 నెలల బాలునికి, మాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 6 నెలల బాలికకు కాలేయాన్ని అమర్చినట్టు వైద్యులు వెల్లడించారు.