ఆమె కడుపులో 18 కిలోల గడ్డ

ఆమె కడుపులో 18 కిలోల గడ్డ

ఆమె కడుపు ఎప్పుడూ ఉబ్బెత్తుగా ఉండేది. గాలి కూడా తీసుకోలేకపోయేది. ఆస్పత్రికి పోదామంటే చేతిలో డబ్బులూ లేవు. ఆమె బాధ చూసి ఊరి జనం తలా ఇన్ని డబ్బులు పోగేసి ఆస్పత్రికి పంపించారు. అక్కడి డాక్టర్లు ఆమెకు టెస్టులు చేస్తే అండాశయంలో ఓ పెద్ద గడ్డ ఉందని తేలింది. అది పెరుగుతూ పెరుగుతూ కడుపు మొత్తాన్ని ఆక్రమించిందని డాక్టర్లు గుర్తించారు. వెంటనే ఆపరేషన్​ చేసి తీసేయాలన్నారు. లేకపోతే ఆ గడ్డ కడుపులో పగిలిపోయి ప్రాణానికే ప్రమాదముందని హెచ్చరించారు. ఇటీవలే ఆపరేషన్​ చేసి ఆ గడ్డను తీసేశారు. ఈ ఘటన మహారాష్ట్రలోని వార్ధాలో జరిగింది. బాధిత మహిళ పేరు కవితా కలాం (38). ఆచార్య వినోబా భావే ఆస్పత్రి వైద్యులు ఈ రిస్కీ ఆపరేషన్​ చేశారు. 95 శాతం పొట్టను ఈ గడ్డ ఆక్రమించిందని ఆపరేషన్​ చేసిన డాక్టర్​ అర్పితా జైస్వాల్​ సింగమ్​ చెప్పారు. ఆ గడ్డ 18 కిలోల బరువుందని చెప్పారు. ఆపరేషన్​కు ముందు 7 నెలల పాటు ఆమె తీవ్రంగా ఇబ్బంది పడిందని చెప్పారు. ఆ గడ్డ మొత్తం నీళ్లే ఉండడంతో ఆపరేషన్​ చాలా రిస్కీ అని, కొంచెం అటూఇటైనా మహిళ ప్రాణానికే ప్రమాదం జరిగి ఉండేదని మరో డాక్టర్​ అభిషేక్​ కొథులే అన్నారు. కడుపు కింది భాగంలో 2 సెంటీమీటర్ల మేర కోసి గడ్డను బయటకు తీశామన్నారు. ఈ గడ్డను సిస్టడెనోమా అని పిలుస్తున్నారు. అయితే, ఇది కేన్సర్​ గడ్డ కాదని డాక్టర్లు తేల్చారు.