
- ఆమోదం తెలిపిన ఈక్విటీ, బాండ్ హోల్డర్లు
న్యూఢిల్లీ : ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో ఐడీఎఫ్‌సీ లిమిటెడ్ విలీనం కావడంపై బ్యాంక్ బాండ్ హోల్డర్లు, షేరు హోల్డర్లు ఆమోదం తెలిపారు. నాన్ కన్వర్ట్‌బుల్ డిబెంచర్ (ఎన్‌సీడీ), ఈక్విటీ హోల్డర్ల అనుమతులు తీసుకోవడానికి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యూనల్ (ఎన్‌సీఎల్‌టీ) మే 17 న వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించింది. విలీనానికి 99.95 శాతం మంది షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారని, 75 శాతం మంది ఈ–ఓటింగ్ ద్వారా తమ ఓటు వేశారని ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.
మరో ఫైలింగ్‌లో 99.99 శాతం మంది ఎన్‌సీడీ హోల్డర్లు విలీనానికి ఓకే చెప్పారని వివరించింది. కాగా, ఐడీఎఫ్‌సీ ఎఫ్‌హెచ్‌సీఎల్ మొదట ఐడీఎఫ్‌సీలో విలీనమవుతుంది. ఆ తర్వాత ఐడీఎఫ్‌సీ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో మెర్జ్ అవుతుంది. ఐడీఎఫ్‌సీ షేరు హోల్డర్ తమ దగ్గరున్న ప్రతి 100 షేర్లకు 155 ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్ షేర్లు పొందుతారు. ఈ రెండు సంస్థల ఫేస్ వాల్యూ రూ.10. కాగా, ఐడీఎఫ్‌సీ ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్‌లకు ఎక్కువగా అప్పులిస్తోంది.
ఈ కంపెనీ 2015 లో ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ను తీసుకొచ్చింది. 2018 లో క్యాపిటల్ ఫస్ట్‌ను కొనుగోలు చేసి ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌గా ఐడీఎఫ్‌సీ బ్యాంక్ ను మార్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మాదిరే విలీన సంస్థ ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్‌లో ప్రమోటర్లు ఉండరు. బ్యాంక్ మొత్తం కంట్రోల్ ఇన్‌స్టిట్యూషనల్, పబ్లిక్ షేరు హోల్డర్ల చేతిల్లో ఉంటుంది.