క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకున్న 22 మంది

క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకున్న 22 మంది

రాయ్ పూర్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్ గఢ్ లోని సొంత ప్రాంతాలకు చేరుకున్న వలస కూలీలను అక్కడి ప్రభుత్వం క్వారంటైన్ లో ఉంచింది. అయితే ఆయా కూలీల్లో కొందరు క్వారంటైన్ సెంటర్ల నుంచి తప్పించుకోవడం ఆ రాష్ట్ర సర్కార్ ను తీవ్రంగా కలవరపెడుతోంది. వలస కూలీల్లో దాదాపు 22 మంది క్వారంటైన్ సెంటర్ల నుంచి పారిపోయి ఉంటారని మావోయిస్టు ప్రభావిత జిల్లా దంతెవాడ జిల్లా కలెక్టర్ తోపేశ్వర్ వర్మ నేషనల్ మీడియాకు తెలియజేశారు. వ్యవసాయ కూలీలను వారి సొంత గ్రామం నహాడికి12 కి.మీ.ల దూరంలో ఉంచామన్నారు. మావోయిస్టు ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతం కావడంతో పారిపోయిన వారిని పట్టుకోవడం పోలీసులకు తలనొప్పిగా మారింది.

‘వలస కూలీలకు గురువారం అర్నాపూర్ లో హెల్త్ టీమ్ మెడికల్ ఎగ్జామినేషన్ నిర్వహించింది. అలాగే వారు తప్పించుకున్న ప్రాంతంలోని పోలీస్ స్టేషన్ లోనే వారిని క్వారంటైన్ లో ఉంచాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మొత్తం 47 మంది వలస కార్మికులు తిరిగొచ్చారు. వీరిలో ఎలాంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. తప్పించుకుపోయిన కార్మికుల విలేజ్ సర్పంచ్ కు, సెక్రటరీకి సమాచారం అందించాం. కానీ మావోయిస్టు ప్రభావం అధికంగా ఉండే నహాడి గ్రామానికి అధికారులు, పోలీసులు ఈ టైమ్ లో చేరుకోవడం సాధ్యం కాదు’ అని వర్మ పేర్కొన్నారు.