V6 News

కాసేపట్లో బీహార్ కేబినెట్ విస్తరణ

కాసేపట్లో బీహార్ కేబినెట్ విస్తరణ

ఇవాళ బీహార్ కేబినెట్ విస్తరణ జరగనుంది. ఇద్దరితో ఉన్న కేబినెట్ను విస్తరించేందుకు సీఎం నితీష్కుమార్ సిద్ధమయ్యారు. కొత్తగా 31మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. మహాకూటమి భాగస్వామ్యపక్షమైన ఆర్జేడీకి ఇందులో అత్యధిక స్థానాలు లభించనున్నాయి. ఆ పార్టీ నుంచి 16మంది మంత్రులుగా ప్రమాణం చేసే చాన్స్ ఉంది. 

నితీష్ కుమార్ గతంలో మంత్రులుగా పనిచేసిన తన పార్టీ ఎమ్మెల్యేలకు మళ్లీ కేబినెట్ లోకి తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్, లలిత్ యాదవ్, సురేంద్ర యాదవ్, కుమార్ సర్వజీత్, సురేంద్ర రామ్, షానవాజ్ ఆలం, సమీర్ మహేసేత్ సహా పలువురు మంత్రులుగా ప్రమాణం చేయనున్నట్లు సమాచారం. ఇక కాంగ్రెస్ నుంచి మురారీ లాల్ గౌతమ్,అఫాక్ ఆలంలకు కేబినెట్ లో చోటు దక్కనుందని అంటున్నారు. 

కాగా ఈ నెల మొదట్లో బీజేపీతో తెగదెంపులు చేసుకుని ఆర్జేడీతో నితీష్ కుమార్ కలిశారు. ఆ తర్వాత ఈ నెల 10న నితీష్ సీఎం, తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. బీహార్ కేబినెట్ లో సీఎంతో కలిపి 36 మంది మంత్రులుగా  ఉండవచ్చు. అయితే భవిష్యత్ లో జరిగే విస్తరణ కోసం కొన్ని స్థానాలను ఖాళీగా ఉంచనున్నట్లు తెలుస్తోంది.