మైనర్లపై కొనసాగుతున్న అఘాయిత్యాలు

మైనర్లపై కొనసాగుతున్న అఘాయిత్యాలు

హైదరాబాద్లో మైనర్లపై అఘాయిత్యాల పరంపర కొనసాగుతూనే ఉంది. జూబ్లీహిల్స్లో బాలిక ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఈ ఘటన మరువకముందే హైదరాబాద్ నగరంలో మరో నాలుగు ఇలాంటి కేసులు వెలుగులోకి వచ్చాయి. బాధితుల్లో ఒకరు12 ఏళ్ల బాలిక కాగా ఇద్దరు అనాథలు ఉన్నారు. 

లిఫ్ట్ ఇస్తానని నమ్మించి

మే 31న పాతబస్తీకి చెందిన 12ఏళ్ల బాలిక ఒంటరిగా అమ్మమ్మ ఇంటికి వెళ్తుండటాన్ని గమనించిన ఓ కారు డ్రైవర్ తనకు లిఫ్ట్ ఇస్తానని కారులోకి ఎక్కించుకున్నాడు. బాలికను నేరుగా కొందుర్గులోని తన స్నేహితుడి ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ తన ఫ్రెండ్ తో కలిసి బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరోవైపు బాలిక తల్లిదండ్రులు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరుసటి రోజు ఉదయం ఇద్దరు నిందితులు సుల్తాన్ షాహీ ఏరియాలో అమ్మాయిని వదిలి వెళ్లిపోయారు. అమ్మాయిని గమనించిన పెట్రోలింగ్ పోలీసులు స్టేషన్ కు తరలించి విచారించగా.. నిందితుల గురించి చెప్పింది. ఆ వివరాల ఆధారంగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన షేక్ కలీం అలీ (36) అతని స్నేహితుడు అహ్మద్ యాజ్దానీని అరెస్ట్ చేశారు.

మాయమాటలు చెప్పి

మే 31 కాలా పత్తర్ ప్రాంతానికి చెందిన బాలికపై 21ఏళ్ల మహమ్మద్ సూఫియాన్ అనే యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కిరాణ షాపులో పనిచేసే సదరు అమ్మాయిని మాయమాటలు చెప్పి తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టాడు. ఘటన అనంతరం ఇంటికి వెళ్లిన బాలిక కడుపునొప్పిగా ఉందని చెప్పడంతో విషయం బయటపడింది. అమ్మాయి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన కాలాపత్తర్ స్టేషన్ పోలీసులు నిందితున్ని అరెస్ట్ చేశారు.

అనాథలపై అఘాయిత్యం
మరోవైపు హైదరాబాద్ లోని ఓ అనాథాశ్రమంలో ఉంటున్న ఇద్దరు ఇంటర్ విద్యార్థులను కామాంధులు కాటేసిన ఉదంతాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనలు ఏప్రిల్ లో జరగగా.. నిందితులు బెదిరించడంతో  నోరు విప్పలేదు. ఆశ్రమ నిర్వాహకులు ఓ బాలిక వద్ద సెల్ ఫోన్ గుర్తించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. దీంతో జూన్ 3న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనాధ బాలికల వసతి గృహంలో ఉన్న విద్యార్థినిని ఆమె స్నేహితుడు ఏప్రిల్ 20న పుట్టినరోజు వేడుక చేసుకుందామంటూ సురేష్ అనే యువకుడు నెక్లెస్ రోడ్కు తీసుకెళ్లాడు. అక్కడ కారులో అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. మరో బాలికకు ఏప్రిల్ 25న ఇంటర్ పరీక్షలు పూర్తికావడంతో ఆమె స్నేహితుడు సినిమాకు వెళ్దామంటూ అత్తాపూర్ లోని మల్టీప్లెక్స్ కు తీసుకెళ్లాడు. మాల్ లో నిర్మానుష్య ప్రదేశంలో ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో సంక్షేమ శాఖ అధికారులు ఇద్దరు నిందితులపై ఫిర్యాదు చేయడంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదుచేసిన పోలీసులు కేసుల్ని రాం గోపాల్ పేట, రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. 

ఇన్స్టాగ్రామ్లో పరిచయం

తాజాగా కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. పదో తరగతి చదువుతున్న బాలికతో ధీరజ్, రితేష్ అనే యువకులు ఇన్స్టాగ్రామ్లో పరిచయం పెంచుకున్నారు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పిన బాలికపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ సమయంలో తీసిన వీడియోలను చూపించి బెదిరిస్తూ తమ స్నేహితులైన శ్రిజిత్, హర్షిత, శౌర్య లతో కలిసి బాలికపై పలుమార్లు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. రెండు నెలలుగా పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడటంతో బాలిక ప్రవర్తనలో మార్పు వచ్చింది. దీంతో తల్లిదండ్రులు ఆమెను సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లగా అసలు విషయం బయటపడింది. దీంతో బాలిక తల్లిదండ్రులు మే 30న కార్ఖానా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదుచేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.