ఏడేండ్ల బాలుడిపై వేడివేడి నీళ్లు పోసిన టీచర్‌‌‌‌

ఏడేండ్ల బాలుడిపై వేడివేడి నీళ్లు పోసిన టీచర్‌‌‌‌
  • కర్నాటక రాయిచూరు జిల్లాలో ఓ టీచర్‌‌‌‌ దారుణం
  • చిన్నారికి 40 శాతం కాలిన గాయాలయ్యాయన్న డాక్టర్లు

బెంగళూరు: స్కూల్‌‌ యూనిఫాంలో మలవిసర్జన చేశాడన్న కారణంతో ఏడేండ్ల బాలుడిపై వేడివేడి నీళ్లు పోశాడో టీచర్‌‌‌‌. ఈ దారుణ ఘటన కర్నాటకలోని రాయిచూరు జిల్లా సంతేకల్లూరు గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం, గ్రామంలోని ఘనమఠేశ్వర గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రైమరీ స్కూల్‌‌లో రోజులాగే రెండో తరగతి చదువుతున్న ఏడేండ్ల బాలుడు శుక్రవారం స్కూల్‌‌కు వచ్చాడు. అనుకోకుండా ఆ రోజు తన స్కూల్‌‌ యూనిఫామ్‌‌లోనే మల విసర్జన చేసుకున్నాడు. విషయం తెలిసిన హులిగెప్ప అనే టీచర్‌‌‌‌ కోపంతో ఆ బాలుడిపై వేడి వేడి నీళ్లు పోశాడు. ఆ వేడికి తట్టుకోలేక పిల్లాడు అల్లాడిపోయాడు.

స్థానికులు బాలుడిని హాస్పిటల్‌‌కు తరలించగా, 40 శాతం కాలిన గాయాలయ్యాయని డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ట్రీట్‌‌మెంట్‌‌ జరుగుతోందని, బాలుడి పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. అయితే, ఈ ఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, అందుకే ఎఫ్‌‌ఐఆర్‌‌‌‌ నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు. తామే విషయం తెలుసుకొని, స్కూల్‌‌కి వెళ్లి విచారించామన్నారు. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో తాము ఏం చేయలేకపోతున్నామని, ఎవరైనా కంప్లైంట్‌‌ ఇస్తే నిందితుడిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.