అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు
  • భక్తులు, హిందూ సంఘాలు, బీజేపీ నిరసనలు

హైదరాబాద్‌‌/ కోస్గి, వెలుగు: అయ్యప్ప స్వామితో  పాటు హిందూ దేవుళ్లపై బైరి నరేశ్ అనే వ్యక్తి చేసిన అనుచిత కామెంట్లు రాష్ట్రంలో దుమారాన్ని లేపాయి. అతని వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ పలు చోట్ల అయ్యప్ప భక్తులు, హిందూ సంఘాలు, బీజేపీ, భజరంగదళ్‌‌ కార్యకర్తలు ఆందోళనలు, రాస్తారోకోలు చేపట్టారు. నరేశ్ అనుచరులతో పాటు, ఆ వేదికను పంచుకున్న నేతల ఇండ్లను ముట్టడించి నిరసనలు తెలిపారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో నిర్వహించిన ఒకసభలో హిందూ దేవుళ్లపై బైరి నరేశ్ అయ్యప్పపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి నిరసనగా చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన పూజారి సీఎస్‌‌ రంగరాజన్‌‌ ఆధ్వర్యంలో బీజేపీ, భజరంగ్‌‌దళ్‌‌ కార్యకర్తలు, అయ్యప్ప భక్తులతో కలిసి మొయినాబాద్‌‌లో ధర్నా నిర్వహించారు. ర్యాలీగా వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తర్వాత రంగరాజన్ మాట్లాడుతూ అయ్యప్ప మాల దీక్ష సమయంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విదేశీ కుట్రలే ఈ నరేశ్ వ్యాఖ్యలు అని ఆరోపించారు. ఇలాంటి కామెంట్లు చేసే వారిపై ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఐపీసీ 295 ఏ, ఐపీసీ 153 కింద కేసు నమోదు చేసి అతని వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియాలోంచి తీసేయాలని.. భక్తులందరూ తమ ఆగ్రహాన్ని... నిరసనను శాంతియుతంగా వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు.

కేసు నమోదు చేశాం: వికారాబాద్‌‌ ఎస్పీ

నరేశ్ పై 153ఏ, 295ఏ, 298, 505 కింద కేసు రిజిస్టర్‌‌ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వికారాబాద్‌‌ ఎస్పీ కోటిరెడ్డి చెప్పారు. గతంలోనూ నరేశ్​పై కేసులు నమోదయ్యాయని అతన్ని పట్టుకోవడానికి నాలుగు టీమ్స్‌‌తో ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. త్వరలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుస్తామని వివరించారు.

బైరి అనుచరుడిపై దాడి

అయ్యప్పపై నరేశ్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా నారాయణపేట జిల్లా కోస్గిలో అయ్యప్ప స్వాములు, భజరంగ్‌‌ దళ్ సభ్యులు రాస్తారోకో చేపట్టారు. పట్టణంలోని శివాజీ చౌక్ లో వీరు చేస్తున్న నిరసన కార్యక్రమం వద్దకు వచ్చిన నరేశ్ అనుచరుడు అందులో మాట్లాడుతున్నోళ్లను వీడియో తీయడం ప్రారంభించారు. ఇది గమనించిన కొంతమంది అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడి చేయడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.