పెండ్లిళ్లలో కట్నాలు బంద్... 20కి పైగా ఆదివాసీ గ్రామాల్లో తీర్మానాలు.. పెండ్లిళ్ల కోసం అప్పులు చేయాల్సిన పని లేదని ధీమా

పెండ్లిళ్లలో కట్నాలు బంద్... 20కి పైగా ఆదివాసీ గ్రామాల్లో తీర్మానాలు.. పెండ్లిళ్ల కోసం అప్పులు చేయాల్సిన పని లేదని ధీమా
  • పాత ఆచారాల వైపే మొగ్గు.. 

ఆసిఫాబాద్, వెలుగు: పెండ్లిళ్లకు కట్నకానులను బంద్​చేయాలని కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల్లోని ఆదివాసీ గ్రామాల్లో తీర్మానాలు చేసుకున్నారు. దాదాపు 20కి పైగా గ్రామాలు ఈ నిర్ణయాలు తీసుకుని మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. గతంలో ఆదివాసీల పెండ్లిళ్లు కుటుంబీకు,   బంధువులు, గ్రామస్తుల మధ్య జరిగేవి. పెద్దగా ఖర్చులు లేకుండా సంప్రదాయాలకు అనుగుణంగా వేడుకలు నిర్వహించుకునేవారు. కాలక్రమేణ కట్నాలు, ఖరీదైన కానుకలు ఇవ్వడం ఆదివాసీల్లోనూ షురూ అయ్యింది.   

పేద కుటుంబాలపై భారం.. 

గతంలో ఆదివాసీల్లో  కట్నం ఇచ్చే  పద్ధతి  ఉండేది కాదు. రెండు కుటుంబాల అంగీకారం, కొద్దిపాటి సరుకులు, వస్తువులతో పెండ్లి తంతు పూర్తయ్యేది. బయటి గ్రామాలతో అనుబంధం పెరుగడం వల్ల ఆదివాసీల్లో మార్పు వచ్చింది.  పెండ్లిళ్లలో బిందెలు, ప్లేట్లు, అల్మారీలు, సోఫా సెట్లు, బెడ్లు, డెకరేషన్ వస్తువులు, ఖరీదైన దుస్తులు  ఇవ్వడం పెరిగింది. కొందరు బైక్​లు కూడా ఇస్తున్నారు. వాళ్లు అంతిచ్చారు.. మీరు తక్కువిచ్చారని పోలుస్తుండడంతో కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నాయి.  దీంతో కట్నకానుకలకు పోటీ పెరిగి పేదలపై భారం పడుతోంది.  పెండ్లిళ్ల కోసం అప్పులు చేసి నవారు తీర్చలేక అవస్థలు పడుతున్నారు.   

మార్పునకు నాంది..

కొన్ని ఆదివాసీ గ్రామాలు మార్పునకు నాంది పలుకుతున్నాయి.  పెండ్లిళ్లలో కట్నకానుకలను నిషేధిస్తూ  తీర్మానాలు చేసుకుంటున్నారు. గ్రామంలో చందాలు వసూలు చేసి పెండ్లి చేసే కుటుంబానికి సాయం అందిస్తున్నారు. ఈ విధానం అమలు చేయడంలో జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్ మండలాల్లోని పలు గ్రామాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. ఆదివాసీ సమాజాన్ని తిరిగి సంప్రదాయ విలువల వైపు తీసుకెళ్తున్నాయని ఆదివాసీ పెద్దలు పేర్కొంటున్నారు.

ఏకగ్రీవంగా తీర్మానాలు..  

గ్రామపెద్దలు తీసుకునే కట్నకానుకల నిషేధ నిర్ణయం ఐక్యతను కాపాడుతోంది. దీనివల్ల ఉన్నోడు-, లేనోడు అనే వ్యత్యాసం ఉండదు. గ్రామస్తులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకునేందుకు ముందుకు వచ్చారు.   ప్రతి కుటుంబం ఇచ్చే చందాలతో  ఆర్థికంగా చేయూతనందిస్తున్నారు. 
‌‌‌‌‌‌‌‌ - పెందోర్ గణపత్ రావు, సర్పంచ్, బుర్నూర్ , జైనూర్

భవిష్యత్తు తరాల ఆదర్శం..

ఆదీవాసి గ్రామాల్లో పెద్దలు తీసుకునే నిర్ణయం భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలువనున్నది. మా గ్రామంలో సాయం అందించే నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. ఈ విధానం పెండ్లిళ్లకే కాకుండా ఇతర కార్యక్రమాకూ అమలు చేస్తే పేద కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గనుంది. 
-  ఆత్రం ఆనంద్ రావు, రాయ్ సెంటర్ సార్ మెడి, 
మహాగం, సిర్పూర్ (యూ)