- తన భార్య, అత్త, బావమరిదితో కలిసి మోసానికి పాల్పడ్డ గోల్డ్ అప్రైజర్
- ఏన్కూరు తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో ఘటన
తల్లాడ, వెలుగు : నకిలీ బంగారం తాకట్టు పెట్టి లక్షల రూపాయల లోన్ తీసుకొని, బ్యాంక్‌ను మోసం చేసిన ముగ్గురిని ఖమ్మం జిల్లా ఏన్కూరు పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్, ఏన్కూరు ఎస్సై సంధ్య గురువారం (ఏప్రిల్ 02) వెల్లడించారు.
శ్రీపాది సతీశ్ అనే వ్యక్తి కల్లూరు డివిజన్లోని ఏన్కూరు తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో గోల్డ్ అప్రైజర్‌గా పనిచేస్తున్నాడు. అతడి భార్య శ్రీపాది మౌనిక, అత్త రామచంద్రోజు జయమ్మ, బావమరిది రామచంద్రోజు నరేశ్ 2024లో అదే బ్యాంక్‌లో 242.25 గ్రాముల ఆభరణాలను పెట్టి రూ. 9.53 లక్షల లోన్ తీసుకున్నారు. డబ్బులు తిరిగి కట్టకపోవడంతో ఆభరణాలను వేలం వేసేందుకు బ్యాంక్ ఆఫీసర్లు ప్రయత్నించారు. ఈ టైంలో వాటిని తనిఖీ చేయగా.. అవి నకిలీవని తేలాయి.
దీంతో బ్యాంక్ అధికారి కేవీ.ప్రశాంత్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఏన్కూరు పోలీసులు గోల్డ్ అప్రైజర్ సతీశ్ తన కుటుంబ సభ్యులతో నకిలీ ఆభరణాలను తాకట్టు పెట్టించి లోన్ మంజూరు చేశారని గుర్తించారు. దీంతో గోల్డ్ అప్రైజర్ సతీశ్‌తో పాటు అతడి అత్త జయమ్మ, బావమరిది నరేశ్‌ను అరెస్ట్ చేయగా.. అతడి భార్య మౌనిక పరారీలో ఉందని ఏసీపీ తెలిపారు.
