తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ రణరంగం వెండితెరకు పాకింది. కోలీవుడ్ అగ్ర నటుడు, తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత దళపతి విజయ్‌ని లక్ష్యంగా చేసుకుని తెరకెక్కినట్లు భావిస్తున్న ‘TN 2026’ చిత్రం ఇప్పుడు పెను సంచలనానికి తెరలేపింది. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ రాజకీయ వర్గాల్లో చిచ్చు రేపడమే కాకుండా, విజయ్ అభిమానుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగిస్తోంది.
టీజర్‌లో ఏముంది?
ఈ చిత్రంలో నట్టి నటరాజ్ ‘గోల్డెన్ స్టార్ గుల్కండ్ కుమార్’ అనే పాత్రలో నటిస్తున్నారు. టీజర్‌లో ఆయన వేషధారణ, నడిచే తీరు, జనాలకు అభివాదం చేసే విధానం అచ్చం విజయ్‌ను తలపిస్తున్నాయి. తెల్ల చొక్కా, ఖాకీ ప్యాంట్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌తో విజయ్ మ్యానరిజమ్స్‌ను ఇమిటేట్ చేసినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ముఖ్యంగా కమెడియన్ రెడిన్ కింగ్స్లీ చెప్పే డైలాగ్ మంటలు పుట్టిస్తోంది. "ఏయ్ సినిమా కుర్రాడా.. ఇది తమిళనాడు. ఇక్కడ బతకాలని ఆశపడటంలో తప్పులేదు కానీ, ఏలాలనుకుంటున్నావా?" అంటూ ఎద్దేవా చేయడం నేరుగా విజయ్ రాజకీయ రంగ ప్రవేశాన్ని ఉద్దేశించినట్లు ఉందనే వాదన వినిపిస్తోంది. అంతేకాకుండా, విజయ్ తన ప్రచారంలో వాడిన ‘ఓం శక్తి పరాశక్తి’ అనే నినాదాన్ని కూడా ఈ టీజర్‌లో వాడటం వివాదాన్ని ముదిరేలా చేసింది.
డీఎంకే, బీజేపీల కుట్ర?
ఈ సినిమా వెనుక అధికార పార్టీ డీఎంకే హస్తం ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. చిత్ర నిర్మాత కణ్ణన్ రవి దుబాయ్‌కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త. ఆయనకు డీఎంకే అగ్రనేతలతో మంచి సంబంధాలు ఉన్నాయని సమాచారం. దీనికి తోడు, విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా విడుదలకు అడ్డంకులు కల్పిస్తూ, సరిగ్గా ఎన్నికల ముందు విజయ్‌ని కించపరిచేలా ఉన్న ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ (CBFC) ఎలా ఇచ్చారనేది ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. .
టీవీకే నేతలు ఫైర్
ఈ టీజర్ విడుదలపై టీవీకే (TVK) కీలక నేత ఆదవ్ అర్జున తీవ్రంగా స్పందించారు. ఇది విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి డిఎంకె (DMK), బిజెపి (BJP)లు కలిసి పన్నిన కుట్ర అని ఆయన ఆరోపించారు. "విజయ్ సినిమా ‘జననాయగన్’ విడుదలకు ఆటంకాలు కల్పిస్తున్న వారు, ఇలాంటి రాజకీయ సెటైర్ సినిమాను ఎన్నికల ముందు ఎలా విడుదల చేస్తారు? గతంలో ‘పరాశక్తి’ సినిమాను విడుదల చేస్తే ప్రజలు పట్టించుకోలేదు, దీని గతి కూడా అంతే" అని ఆయన ధ్వజమెత్తారు.
అన్నా డీఎంకేను ఎద్దేవా చేస్తూ..
టీజర్ నిశితంగా గమనిస్తే, కేవలం విజయ్‌నే కాకుండా అన్నా డీఎంకే (AIADMK) ను కూడా కామెడీ చేసినట్లు కనిపిస్తోంది. సినిమాలో హీరోయిన్లతో ఫిల్మ్ స్టార్ చేసే సీన్లు, ప్రచార సమయంలో జరిగే తొక్కిసలాట సంఘటనలు, లారీల కాన్వాయ్ సీన్లు ప్రస్తుత తమిళ రాజకీయాల్లోని వాస్తవ పరిస్థితులను సెటైరిక్‌గా చూపిస్తున్నాయి. ప్రస్తుతం విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో ఈ సినిమాను బహిష్కరించాలని పిలుపునిస్తూ, సెన్సార్ బోర్డును ట్యాగ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
యాక్షన్ కింగ్ అర్జున్ అల్లుడు దర్శకత్వంలో..
ఈ సినిమా వెనుక ఉన్న మరో ఆసక్తికర అంశం దీని టెక్నికల్ టీమ్. ఈ చిత్రానికి కథను అందించిన తంబి రామయ్య జాతీయ అవార్డు గ్రహీత, సీనియర్ నటుడు. ఆయన కుమారుడు ఉమాపతి రామయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఉమాపతి ఎవరో కాదు.. యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా అల్లుడు. అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ను ఆయన వివాహం చేసుకున్నారు. హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన ఉమాపతి, ఐదారు సినిమాల విరామం తర్వాత ఇప్పుడు మెగాఫోన్ పట్టారు. అర్జున్-విశ్వక్ సేన్ వివాదం తర్వాత వచ్చిన గ్యాప్‌లో వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే.
►ALSO READ | ఏయ్ సినిమా కుర్రాడా.. తమిళనాడును ఏలాలనుకుంటున్నావా?.. 'TN 2026' టీజర్ రిలీజ్!
ఏప్రిల్ 10న విడుదలయ్యేనా?
ఉమాపతి రామయ్య దర్శకత్వంలో తంబి రామయ్య, ఎం.ఎస్. భాస్కర్ వంటి ఉద్దండులు నటిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదల కావాల్సి ఉంది. అయితే, ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఒక రాజకీయ పార్టీని లేదా నాయకుడిని కించపరిచేలా ఉన్న ఈ సినిమా విడుదలకు సెన్సార్ బోర్డు , ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాయా? అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. మొత్తానికి, వెండితెరపై మొదలైన ఈ ‘ప్రచ్ఛన్న యుద్ధం’ తమిళనాడు ఓటర్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి!
