కోలీవుడ్ సినిమా అంటేనే పొలిటికల్ హీట్. మరీ ముఖ్యంగా తమిళనాడు రాజకీయాలు, సినిమా స్టార్ల చుట్టూ తిరిగే కథలకు అక్కడ ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన 'TN 2026' టీజర్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమా పేరు వినగానే అందరి దృష్టి దళపతి విజయ్ వైపు మళ్లుతోంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో 'TN 2026' మూవీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
విజయ్ రాజకీయ ప్రయాణానికి బూస్టప్?
దళపతి విజయ్ నటించిన ‘జననాయగన్’ చిత్రం కొన్ని అనివార్య కారణాలు, రాజకీయ ఒత్తిళ్ల వల్ల వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు రాబోతున్న ‘TN 2026’ చిత్రం మాత్రం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏప్రిల్ 10న థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. ఈ సినిమా టైలర్ చూస్తేనే మెయిన్ రోల్ విజయ్ ని పోలి ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇది విజయ్ రాజకీయ భవిష్యత్తుకు పరోక్షంగా దెబ్బతీసేలా ఉందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ ‘జననాయగన్’ ను అడ్డుకున్న సెన్సార్ బోర్డు ఈ ‘TN 2026’ మూవీకి ఎలా అనుమతి ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
కథా నేపథ్యం
ఈ చిత్రం పక్కా పొలిటికల్ సెటైరికల్ డ్రామాగా తెరకెక్కుతోంది. ప్రముఖ నటుడు నట్టి నటరాజ్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఒక సూపర్ స్టార్ తన అభిమాన సంఘాలను రాజకీయ పార్టీగా మార్చి, ఎన్నికల బరిలోకి దిగితే ఎదురయ్యే సవాళ్లే ఈ చిత్ర ఇతివృత్తం. ఒక నటుడు రాష్ట్రాన్ని ఎలా పాలిస్తాడు? అని ప్రశ్నించే సీనియర్ రాజకీయ నాయకులకు, తనదైన స్టైల్లో హీరో ఇచ్చే కౌంటర్లు టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి. ప్రస్తుత తమిళనాడు రాజకీయాల్లో జరుగుతున్న వాస్తవ సంఘటనలను, ముఖ్యంగా స్టార్ హీరో రాజకీయ ఎంట్రీని కూడా ఈ సినిమాలో చాలా సెటైరిక్‌గా చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది.
►ALSO READ | Saraswathi OTT: ఓటీటీకి వచ్చిన కోర్ట్‌రూమ్ క్రైమ్ డ్రామా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తెర వెనుక దిగ్గజాలు
ఈ పవర్‌ఫుల్ పొలిటికల్ స్టోరీని ప్రముఖ నటుడు తంబి రామయ్య అందించడం విశేషం. ఆయన కుమారుడు ఉమాపతి రామయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. తండ్రి అనుభవం, కొడుకు విజన్ కలిసి ఈ సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దాయని సమాచారం. దర్బుక శివ అందిస్తున్న సంగీతం టీజర్‌కు ప్రాణం పోయగా, కణ్ణన్ రవి అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఏప్రిల్ 10న 'పొలిటికల్ వార్'
ఈ సినిమాలో ఎం.ఎస్. భాస్కర్, ఇళవరసు, రెడిన్ కింగ్స్లీ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ పొలిటికల్ హీట్‌ను పెంచేయగా, సినిమా ఏ స్థాయి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో 'TN 2026' విడుదల కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి ఒక స్టార్ హీరో రాజకీయాల్లోకి వస్తే జరిగే అసలు సిసలు 'డ్రామా'ను వెండితెరపై చూడాలంటే ఏప్రిల్ 10 వరకు వేచి చూడాల్సిందే..
