- బాయిలర్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ కమిటీ వెల్లడి
బషీర్‌బాగ్, వెలుగు : చికెన్ రేటు మార్జిన్ విషయంలో రిటైల్ షాపు వ్యాపా రులు పొంతన లేకుండా వ్యవహరిస్తున్నారని బాయిలర్ ఇంటిగ్రేషన్ కోఆర్డినేషన్ కమిటీ తెలిపింది. గురువారం హైదరాబాద్ సోమాజిగూడలోని ఓ హోటల్లో కమిటీ ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. స్నేహ చికెన్ ఎండీ రామిరెడ్డి , వెంకటేశ్వర హేచరీలు జీఎం బాలసుబ్రహ్మణ్యన్, వెన్ కాబ్ చికెన్ ఏపీ, టీఎస్ ఇన్చార్జి రాజిరెడ్డి లు మాట్లాడుతూ.. కొన్నేండ్లుగా కిలో చికెన్‌కు రూ.40 మార్జిన్ ఇస్తున్నామన్నారు. అయినా కొంతమంది వ్యాపారులు రూ.30 కావాలంటూ బంద్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
చికెన్ లైవ్ రేట్లు, రిటైల్ ధరలను పత్రికల ద్వారా పారదర్శకంగా ప్రకటిస్తున్నామని తెలిపారు. కరోనా సమయంలో కూడా వ్యాపారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అదే రేటు ఇచ్చామని వివరించారు. కంపెనీలు నష్టాల్లో ఉన్నా కస్టమర్ పై భారం పడకుండా ధరలను నియంత్రిస్తున్నామని చెప్పారు. రిటైల్ వ్యాపారులతో చర్చకు సిద్ధంగా ఉన్నామని, మార్జిన్‌పై పూర్తి వివరాలు చెప్పేందుకు ముందుంటామని స్పష్టం చేశారు.
