డ్రైవింగ్ లైసెన్స్​లపై ట్రాఫిక్ పోలీస్ నజర్

డ్రైవింగ్ లైసెన్స్​లపై  ట్రాఫిక్ పోలీస్ నజర్
  •    లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేసిన వారిని గుర్తించి 6 నెలల్లో 22 వేల 264 కేసులు నమోదు
  •      వీరిలో వెయ్యికి పైగా మైనర్లే
  •     826 మందికి శిక్ష విధించిన జువైనల్ కోర్టులు

హైదరాబాద్, వెలుగు : సిటీ రోడ్లపై వరుస ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని ప్రమాదాల్లో  లైసెన్స్ లేకుండా నిర్లక్ష్యపు డ్రైవింగ్, ఓవర్ స్పీడ్.. ఎదుటి వారి ప్రాణాలను తీస్తున్నాయి.  మంగళవారం ఉదయం బండ్లగూడ జాగీర్ పరిధి సన్ సిటీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మార్నింగ్ వాక్​కు వెళ్లిన తల్లీకూతురు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో కారు నడిపిన బదియుద్దీన్(19)కు డ్రైవింగ్ లైసెన్స్ లేకపోగా.. వెహికల్ కూడా అతడిది కాదు. 

దీంతో బదియుద్దీన్​తో పాటు అతడికి కారు ఇచ్చిన ఫ్రెండ్​పై సైతం పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రేటర్​లోని 3 కమిషనరేట్ల పరిధిలో జరుగుతున్న ఇలాంటి ప్రమాదాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ప్రమాదాల నివారణ కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. మైనర్ డ్రైవింగ్, డ్రైవింగ్ లైసెన్స్​లు లేని వారిపై కేసులు బుక్ చేస్తున్నారు.

3,583 మందిపై కోర్టులో చార్జిషీట్.. 

రోడ్ సేఫ్టీలో భాగంగా ఈ ఏడాది జనవరి నుంచి గత నెల వరకు డ్రైవింగ్ లైసెన్స్ లేని వారిపై పోలీసులు కేసులు రిజిస్టర్ చేశారు. ఆరు నెలల వ్యవధిలో 22,264 కేసులు నమోదు చేశారు. ఇందులో 3,583 మందిపై కోర్టులో చార్జిషీట్​ను దాఖలు చేశారు. మోటార్ వెహికల్ యాక్ట్ సెక్షన్ 180, 181 కింద కోర్టులు వారికి జరిమానాలు విధించాయి.1,022 మంది మైనర్లలో 826 మందికి జువెనల్ కోర్టులు శిక్షలు విధించాయి. వారి తల్లిదండ్రులను కూడా కేసులో బాధ్యులుగా చేశాయి. మరికొందరి మైనర్ల కుటుంబ సభ్యులకు ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు.

మైనర్‌‌ ‌‌డ్రైవింగ్‌‌పై నిఘా

మైనర్ డ్రైవింగ్‌‌పై ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఓవర్ స్పీడింగ్‌‌తో చేస్తూ ప్రమాదాలకు కారకులు అవుతున్నట్లు గుర్తించారు. రాంగ్‌‌ రూట్, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్న వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నారు. మైనర్లకు వెహికల్‌‌ ఇచ్చిన బైక్, కార్ల ఓనర్లపై చట్టపరమైన చర్యలు చేపట్టారు. పేరెంట్స్‌‌ను బాధ్యులుగా చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు. లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేసిన వారిపై ఐపీసీ సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నారు.

మైనర్లకు వెహికల్ ఇవ్వొద్దు 

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. మైనర్లకు వెహికల్‌‌ ఇచ్చేముందు తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించుకోవాలి. తమ పిల్లల ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలకు కూడా ప్రమాదం పొంచి ఉందని గుర్తించాలి. రూల్స్ పాటించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

– సుధీర్ బాబు, అడిషనల్ సీపీ, ట్రాఫిక్