ఒక శాఖకు ఒకే పెద్దాఫీసర్

ఒక శాఖకు ఒకే పెద్దాఫీసర్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కారు భారీగా చేపట్టిన ఐఏఎస్​ల బదిలీలో కొత్త ప్లాన్​ను అమలు చేసింది. ఇప్పటివరకు ప్రతిశాఖకు ఒక ప్రిన్సిపల్ సెక్రెటరీతోపాటు కమిషనర్ లేదా సెక్రెటరీ స్థాయిలో మరో అధికారి కలిపి ఇద్దరు ఐఏఎస్ లు ఉండగా.. తాజాగా ఈ రెండు పోస్టుల బాధ్యతలను ఒకే అధికారికి అప్పగించారు. సాంకేతిక అంశాలతో ముడిపడి ఉన్న కొన్నిశాఖలకు మాత్రం ఇద్దరు అధికారులను నియమించారు. ఇక అవినీతి ఆరోపణలు, పనితీరు సరిగా లేదన్న విమర్శలు, అసంతృప్తితో ఉన్న ఆఫీసర్లను పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేశారు. కొందరు ఐఏఎస్​లకు పోస్టింగ్​లు ఇవ్వలేదు.

భారీ కసరత్తు తర్వాతే..

ఆదివారం చేపట్టిన బదిలీల వెనుక సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​ల స్థాయిలో భారీ కసరత్తు జరిగినట్టు సమాచారం. ఉన్నతాధికారుల బదిలీలు ఉంటాయని చాలా రోజులుగా చర్చ జరుగుతోంది. 2018 డిసెంబర్ నుంచి రాష్ట్రంలో వరుసగా ఎలక్షన్లు జరుగుతుండటంతో వాయిదా పడుతూ వచ్చింది. కొత్త సీఎస్ గా బాధ్యతలు చేపట్టిన సోమేశ్​ కుమార్  పలు పరిపాలనా సంస్కరణలు తీసుకురావాల్సి ఉందని ఇటీవల వ్యాఖ్యానించారు. అదే కోవలో భారీగా బదిలీలు జరిగాయి.

ఒకే ఆఫీసర్​తో పని సులువని..

ఇప్పటివరకు శాఖల్లో ప్రిన్సిపల్ సెక్రెటరీ, కమిషనర్ లేదా సెక్రెటరీలుగా ఇద్దరు అధికారులు ఉండగా.. సర్కారు మొత్తంగా ఒకే అధికారి ఉండేలా పోస్టింగ్​లు ఇచ్చింది. దీనివల్ల ఫైళ్ల క్లియరెన్స్, నిర్ణయాల అమలు వంటివి త్వరగా పూర్తవుతాయని ఉన్నతాధికారులు చెప్తున్నారు. సీఎస్  సోమేశ్​కుమార్ గతంలో ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్​సెక్రెటరీ, కమిషనర్  రెండు పోస్టుల్లోనూ కొనసాగారు. అప్పుడు ఫైళ్లు త్వరగా క్లియర్​ అయ్యాయని, కీలక నిర్ణయాలు వేగంగా అమలయ్యాయని అంటున్నారు. సోమేశ్​కుమార్​ ఇదే ఫార్ములాను సీఎం దగ్గర ప్రతిపాదించారని, సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. తాజాగా వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్  రెండు పోస్టులు కలిపి జనార్దనరెడ్డికి అప్పగించారు. బీసీ వెల్ఫేర్ కార్యదర్శి, కమిషనర్  పోస్టులను బుర్రా వెంకటేశంకు ఇచ్చారు. విద్యాశాఖలో ఇటీవలి వరకు ఇద్దరు అధికారులు ఉండగా.. ఇప్పుడు స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్  ఒక్కరికే అప్పగించారు.

కొందరు సీనియర్లకు ప్రాధాన్యత లేని పోస్టులు

ఇప్పటివరకు కీలక పోస్టుల్లో ఉన్న కొందరు అధికారులను పెద్దగా ప్రాధాన్యత లేని పోస్టులకు బదిలీ చేయడం చర్చనీయాంశంగా మారింది. వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్  సెక్రెటరీగా ఉన్న సీనియర్ ఐఏఎస్ పార్థసారథిని ఈపీటీఆర్ఐ డీజీగా బదిలీ చేశారు. సీఎస్ పోస్టు కోసం చివరివరకు ప్రయత్నించిన జీఏడీ స్పెషల్ సీఎస్ అధర్ సిన్హాకు పశుసంవర్థక శాఖ స్పెషల్ సీఎస్ గా పోస్టింగ్​ ఇచ్చారు. ఎస్సీ అభివృద్ధిశాఖ కమిషనర్ గా ఉన్న మహేష్ దత్ ఎక్కా, విద్యాశాఖ కమిషనర్  విజయ్ కుమార్, బీసీ వెల్ఫేర్ కమిషనర్ గా ఉన్న అనితా రాజేంద్ర, సీసీఎల్ఏ డైరెక్టర్​గా పనిచేసిన వాకాటి కరుణను బదిలీ చేసినా.. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళనలో కరుణ తీరు వల్ల ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిందని, అందుకే పోస్టింగ్​ ఇవ్వలేదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆసరా కొత్త లబ్ధిదారుల ఎంపిక లో అక్రమాలు జరిగాయంటూ ఓ కీలక మంత్రి సెర్ప్ సీఈవో పౌసమి బసుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యంలో.. ఆమె తాజాగా వికారాబాద్ కలెక్టర్ గా బదిలీ అయ్యారు. మహబూబాబాద్ కలెక్టర్  శివలింగయ్యను బదిలీ చేసి, ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.

హైదరాబాద్ అధికారులు జిల్లా కలెక్టర్లుగా..

జీహెచ్ఎంసీలో అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లుగా పనిచేస్తున్న యువ అధికారులకు జిల్లా కలెక్టర్లుగా పోస్టింగ్ ఇచ్చారు. జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్  దాసరి హరిచందనను నారాయణపేట కలెక్టర్ గా, అడిషనల్ కమిషనర్  ముషారఫ్ అలీని నిర్మల్ కలెక్టర్ గా, శ్రుతి ఓజాను గద్వాల కలెక్టర్ గా, సందీప్ కుమార్ ఝాను ఆసిఫాబాద్ కలెక్టర్ గా, సిక్తా పట్నాయక్ ను పెద్దపల్లి కలెక్టర్ గా బదిలీ చేశారు. జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్లుగా కొత్త అధికారులకు పోస్టింగ్ ఇచ్చారు.

అనుభవం లేనివారికీ కీలక శాఖలు

జిల్లా కలెక్టర్లుగా పనిచేస్తున్న పలువురు ఐఏఎస్​లకు కీలకశాఖల్లో పోస్టింగ్​ ఇవ్వడం చర్చనీయాంశమైంది. కామారెడ్డి కలెక్టర్  సత్యనారాయణను మున్సిపల్ శాఖ కమిషనర్, డైరెక్టర్ గా బదిలీ చేశారు. గతంలో ఆయనకు ఏ శాఖలోనూ పనిచేసిన అనుభవం లేదని సెక్రటేరియెట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మహబూబ్ నగర్  కలెక్టర్  రోనాల్డ్ రాస్ కు ఫైనాన్స్ సెక్రెటరీగా పోస్టింగ్​ ఇచ్చారు. చాలాకాలం తర్వాత సీసీఎల్ఏ కు డైరెక్టర్ ను నియమించారు. కొత్తగూడెం కలెక్టర్  రజత్ కుమార్ షైనీకి ఆ పోస్టు ఇచ్చారు.

మరన్ని వార్తల కోసం..