ఆర్టీసీలో డ్రైవర్​ కమ్​ కండక్టర్

ఆర్టీసీలో డ్రైవర్​ కమ్​ కండక్టర్
  •      ఒక్కరే రెండు డ్యూటీలు చేసేలా మార్పు 
  •     త్వరలో 2 వేల డ్రైవర్​ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్   
  •      అధికారుల తుది నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం 

హైదరాబాద్, వెలుగు: జిల్లాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసుల్లో ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్​, కండక్టర్ డ్యూటీ ఒకరే చేసేలా టీఎస్​ ఆర్టీసీ నిర్ణయించినది. ప్రస్తుతం పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సులు మినహా మిగతా వాటికి డ్రైవర్లే టికెట్లు జారీ చేస్తున్నారు. కొన్ని నాన్ స్టాప్ సర్వీసుల్లో నిర్ధారిత పాయింట్ల వద్ద కండక్టర్లు బస్సు ఎక్కి టికెట్లు జారీ చేసి దిగిపోతున్నారు. ఇకముందు డ్రైవర్ జాబ్ లోకి వచ్చే వ్యక్తి కండక్టర్ డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు డ్రైవర్ కం కండక్టర్ పేరుతో పోస్టులు భర్తీ చేసే యోచనలో ఆర్టీసీ ఉంది. దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఆర్థిక భారాన్ని తగ్గించుకునేందుకు..

ప్రస్తుతం ఆర్టీసీ ఆర్థిక కష్టాల్లో ఉంది. సంస్థను బలోపేతం చేసేందుకు టికెటేతర ఆదాయంపై అధికారులు దృష్టి పెట్టారు. ఇప్పటికే లాజిస్టిక్​ సర్వీసులు నిర్వహిస్తున్నారు. భవిష్యత్ లో జీతాల భారాన్ని తగ్గించుకోవాలంటే ప్రత్యేకంగా కండక్టర్ల రిక్రూట్ మెంట్ అవసరం లేదనే అభిప్రాయం కూడా ఉంది. మరోవైపు డ్రైవర్ పోస్టులకు ఉన్న కొరత కండక్టర్ పోస్టులకు లేదు.

దీంతో ఆ పోస్టు పేరు మార్చాలని అధికారులు నిర్ణయించినట్టు సమాచారం. ప్రస్తుతం ఆర్టీసీలో ఇతర జిల్లాల సర్వీసుల్లో డ్రైవరే టికెట్​లు జారీ చేసే పద్ధతి కొన్ని జిల్లాల్లో అమలవుతోంది. దీనిని పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లోనూ అమలులో ఉంది. ఆర్టీసీ కొత్త నియామకాల్లో భాగంగా 2వేలు డ్రైవర్ల పోస్టులే ఉన్నట్టు సమాచారం. మిగిలిన వెయ్యి పోస్టులు ఆఫీసులకు సంబంధించినవి ఉన్నాయని తెలిసింది.  

త్వరలో నోటిఫికేషన్​

 ఆర్టీసీలో కొత్త డ్రైవర్ల పోస్టులకు నోటిఫికేషన్​ త్వరలోనే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు అందులో ఈ కొత్త పద్ధతిని తీసుకురానున్నట్టు సమాచారం. ప్రస్తుతం సర్కార్ లోక్ సభ ఎన్నికల బిజీలో ఉండగా పూర్తయిన తర్వాతనే  నోటిఫికేషన్లు వచ్చే చాన్స్ ఉందని అధికారులు తెలిపారు. దాదాపు 3  వేల పోస్టులను భర్తీ చేసే చాన్స్ ఉంది.  ఆర్టీసీ ప్రతిపాదిత ఫైల్ సీఎం పరిశీలనకు వెళ్లనుంది. ఆమోదముద్ర వేస్తే నోటిఫికేషన్ ఇస్తారు.