ఎల్లుండి నుంచి (మే 17) సినిమా థియేటర్లు మూసివేత

ఎల్లుండి నుంచి (మే 17)  సినిమా థియేటర్లు మూసివేత

హైదరాబాద్ సినిమా ధియేటర్లను మూసివేస్తున్నారు.. అవును నిజం ఇది.. మే 17వ తేదీ నుంచి హైదరాబాద్ సిటీతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సింగిల్ స్క్రీన్ సినిమా హాళ్లను మూసివేయనున్నట్లు ప్రకటించారు యజమానులు. సినిమా ధియేటర్లను మూసివేయటం ఎందుకు.. కారణాలు ఏంటీ అనే అనుమానాలు రావొచ్చు. అక్కడికే వస్తున్నాం.. సహజంగా సమ్మర్.. ఎండాకాలంలో బోలెడు సినిమాలు విడుదల అవుతుంటాయి..

ఈసారి అందుకు భిన్నంగా ఈ సమ్మర్ హాలిడేస్ లో కొత్త సినిమాలు రిలీజ్ కాలేదు. దీనికి కారణం ఎన్నికలు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో కొత్త సినిమాల విడుదలకు వాయిదా వేసుకున్నారు నిర్మాతలు. అంతేకాకుండా ఈ సారి సమ్మర్ టార్గెట్ గా చిన్నా చితక, పెద్ద సినిమాలు ఏవీ విడుదల కాలేదు. దీంతో సింగిల్ ధియేటర్లలో సినిమాలు పడటం లేదు. కొన్ని సినిమాలను రీ రిలీజ్ చేసుకుంటూ.. చిన్న సినిమాలను ఆడిస్తున్నారు ధియేటర్ల యజమానులు.

అయితే చిన్న సినిమాలకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించటం లేదు. ఈ క్రమంలోనే ధియేటర్ కరెంట్ ఛార్జీలు, మెయింటెనెన్స్ ఖర్చులు సైతం రాకపోవటం.. నష్టాలు వస్తుండటం.. మే నెలాఖరు వరకు కొత్త సినిమాలు విడుదల లేకపోవటంతో.. ధియేటర్లు మూసివేయాలని నిర్ణయించారు యజమానులు. 

సింగిల్ స్క్రీన్ ధియేటర్లు మూసివేస్తున్నారు సరే.. మరి మల్టీఫ్లెక్స్ సంగతి ఏంటీ అంటారా.. ఆ ధియేటర్లలో తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లీష్, హాలీవుడ్, ఇతర భాషా చిత్రాలు వేస్తుంటారు. దీంతో వాళ్లకు గిట్టుబాటు అవుతుంది. దీనికితోడు మరీ నష్టాలు వస్తున్నాయి అనుకుంటే కొన్ని స్క్రీన్స్ క్లోజ్ చేస్తారు. దీంతో వాళ్లకు ఇబ్బంది ఉండదు. సింగిల్ స్క్రీన్ ధియేటర్లకు అలా కాదు కదా.. అందుకే వాటిని మూసివేస్తున్నారు.