పీహెచ్ డీలో ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్కు ఓయూలో కాకుండా ప్రైవేట్లో సీటు

పీహెచ్ డీలో  ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్కు ఓయూలో కాకుండా ప్రైవేట్లో సీటు

ఓయూ, వెలుగు: పీహెచ్‌‌డీ ఫీజుల పెంపును వ్యతిరేకిస్తూ ఆందోళనకు దిగిన విద్యార్థులపై ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. పొలిటికల్‌‌ సైన్స్​లో ఫస్ట్‌‌ ర్యాంకు సాధించిన ఓ స్టూడెంట్‌‌కు ఓయూ క్యాంపస్‌‌లో కాకుండా, సిద్దిపేటలోని ఓ ప్రైవేటు సెంటర్‌‌‌‌లో సీటు కేటాయించారు. ఈ విషయంపై విద్యార్థులు ఆందోళనలు చేయడంతో, తప్పు తెలుసుకున్న అధికారులు.. సీటు కేటాయింపులో పొరపాటు జరిగిందని ఒప్పుకున్నారు. అధికారుల నిర్లక్ష్యం, కక్షపూరిత వైఖరితో ఇంకా ఎంత మంది విద్యార్థులకు నష్టం జరిగిందోనని పలు విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఓయూ నిర్వహించిన పీహెచ్‌‌డీ అడ్మిషన్లలో ట్యూషన్ ఫీజును రూ.2 వేల నుంచి ఏకంగా రూ.20 వేలకు పెంచారు. ఫీజును తగ్గించాలని ఆందోళనలు చేస్తున్న విద్యార్థులకు నాయకత్వం వహిస్తున్న సత్య నెల్లి అనే స్టూడెంట్‌‌కి పొలిటికల్ సైన్స్​లో 75 మార్కులతో ఆ డిపార్ట్​మెంట్‌‌లోనే ఫస్ట్‌‌ ర్యాంక్‌‌ వచ్చింది. ఆందోళనకు ప్రధాన కారకుడు సత్యనే అని తెలుసుకున్న ఓయూ అధికారులు అతనిపై కక్షతో ఓయూ క్యాంపస్‌‌లో సీటుకు బదులు సిద్దిపేటలోని ఓ ప్రైవేటు కాలేజీలోని ఓ లెక్చరర్‌‌‌‌ను అతనికి గైడ్‌‌గా కేటాయించారు.

దీనిపై సదరు విద్యార్థితో పాటు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో, తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. సంబంధిత డిపార్ట్​మెంట్‌‌ హెడ్‌‌, డీఆర్సీ మధ్య సమన్వయ లోపంతో ఈ తప్పు జరిగిందని వర్సిటీ అధికారులు తెలిపారు. సమస్యను పరిష్కరించేందుకు ఆయా విభాగాల డీన్లతో కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. కమిటీ నివేదిక ఆధారంగా అర్హత ఉన్న ప్రతి స్టూడెంట్‌‌కి న్యాయం చేస్తామని చెప్పారు. పీహెచ్‌‌డీ సీట్ల కేటాయింపు పూర్తిగా ఆయా విభాగాలు, డీన్లకు సంబంధించిన వ్యవహారమని, ఇందులో పరిపాలనా విభాగానికి సంబంధం ఉండదని అధికారులు తెలిపారు. చేసిన తప్పు తెలుసుకొని తమకు ఇక్కడే సీట్లు కేటాయించాలని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని పీహెచ్‌‌డీ స్టూడెంట్లు అన్నారు. అలాగే, పెంచిన పీహెచ్‌‌డీ ఫీజులను తగ్గించాలని, హాస్టల్‌‌ మెస్‌‌ సౌకర్యం కల్పించాలన్నారు.