బోర్ బావి సీజ్ చేస్తే.. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

 బోర్ బావి సీజ్ చేస్తే.. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం

యాదాద్రి: తమ పొలంలోని వ్యవసాయ బోరును పోలీసులు సీజ్ చేస్తే.. మనస్తాపానికి గురైన మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. యాదాద్రి జిల్లా మోటకొండూర్ మండలం రాయికుంటపల్లిలో మంగళవారం జరిగిందీ ఘటన. తనకు జీవనోపాధి కల్పిస్తున్న వ్యవసాయ భూమిని అక్రమంగా లాక్కోవడానికే బోరు బావిని సీజ్ చేశారంటూ బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది.
గ్రామానికి చెందిన కొరకంటి నర్సమ్మ అనే మహిళ చెరువు శిఖానికి సంబంధించిన ఎకరం భూమిలో గత 40 ఏండ్లుగా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తోంది. అయితే ఈ బోరును పోలీసుల సహకారంతో రెవెన్యూ అధికారులు వచ్చి సీజ్ చేశారు. దశాబ్దాలుగా తమ కుటుంబానికి జీవనాధారమైన పొలంలోని బోరును సీజ్ చేయడంతో మనస్తాపానికి గురైన నర్సమ్మ పురుగుల మందు తాగింది. ఇది గుర్తించిన స్థానికులు హుటాహుటిన అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. బాధితురాలికి మద్దతుగా స్థానికులు ఆందోళనకు దిగారు. 40 ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని అక్రమంగా లాక్కోవడానికే బోరు సీజ్ చేశారని ఆరోపిస్తూ మోటకొండూర్ తహశీల్దార్ ఆఫీసు ముందు స్థానికులు ఆందోళన నిర్వహించారు.