V6 News

సోనాలి ఫోగట్ మృతికేసులో కీలక మలుపు

సోనాలి ఫోగట్ మృతికేసులో కీలక మలుపు

నటి సోనాలీ ఫోగాట్‌ (42) ఆకస్మిక మరణం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. తాజాగా పోస్టుమార్టం నివేదికలో సోనాలీ ఫోగాట్ శరీరంపై గాయాలు ఉన్నట్టు తేలడం కలకలం రేపుతోంది. సోనాలీ శరీరంపై పలు చోట్ల గాయాలు ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు. గోవా పర్యటనలో సోనాలీ ఫోగాట్ తో పాటు ఉన్న ఆమె పీఏ సుధీర్‌ సంగ్వాన్‌, సుఖ్విందర్‌ వాసీలపై హత్యానేరం కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. సోనాలీ మరణంపై అనుమానం వ్యక్తం చేస్తూ ఆమె సోదరుడు రింకూ ఢాకా బుధవారం అంజునా పోలీస్‌ స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఫోగట్‌ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ 302 సెక్షన్‌ ప్రకారం పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. గోవా డీజీపీ స్వయంగా ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. సోనాలీ ఫోగాట్‌ డెడ్ బాడీకి గోవా ప్రభుత్వ వైద్య కళాశాలలో పోస్టుమార్టం పూర్తి చేశారు.

అసలేం జరిగిందంటే..? 
సోనాలీ తన సిబ్బందితో కలిసి ఇటీవల గోవా పర్యటనకు వెళ్లారు. ఆమెకు అస్వస్థతగా ఉందని గత సోమవారం రాత్రి ఉత్తర గోవా జిల్లాలోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే ఆమె గుండెపోటుతో మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. సోషల్ మీడియాల్లో చురుగ్గా ఉండే సోనాలీ రాత్రి 7, 8 గంటల మధ్య కూడా పింక్‌ రంగు తలపాగాతో ఉన్న తన వీడియోలు, ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్‌ చేశారు. సోనాలీ ఫోగాట్ కు ఇన్‌స్టాగ్రామ్ లో దాదాపు 9లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలోని ఆదంపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, ఓటమి చెందారు. సోనాలీ భర్త కొన్నేళ్ల కిందట మృతిచెందారు.