గంటలో 55 వేల కోట్లు నష్టం

గంటలో 55 వేల కోట్లు నష్టం

ముంబై: ఆసియా కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీకి నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌డీఎల్) భారీ షాక్ ఇచ్చింది. అదానీ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన మూడు విదేశీ కంపెనీల ఖాతాలను ఎన్‌ఎస్‌డీఎల్ స్తంభింపజేసింది. దీంతో అదానీ గ్రూప్‌నకు చెందిన షేర్లు భారీగా నష్టపోయాయి. ఒక్క గంట వ్యవధిలో షేర్లన్నీ లోయర్ సర్క్యూట్‌‌ను తాకడంతో అదానీ నికర సంపద 7.6 బిలియన్‌ డాలర్ల(దాదాపు రూ.55వేల కోట్లు) ఆవిరైంది. మొత్తంగా ఒక రోజు వ్యవధిలో రూ.1.03 లక్ష కోట్లు నష్టపోయినట్లు తెలిసింది. ఎన్‌ఎస్‌‌డీఎల్ స్తంభింపజేసిన అల్బులా ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌, క్రెస్టా ఫండ్‌, ఏపీఎంఎస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌లకు అదానీ గ్రూప్‌లో దాదాపుగా రూ.43,500 కోట్లు విలువైన షేర్లు ఉన్నాయి. అయితే మనీ లాండరింగ్‌ నివారణ చట్టం ప్రకారం.. ఈ ఖాతాల యాజమాన్యానికి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించలేదు. దీంతో మే 31 లేదా అంతకంటే ముందే ఈ ఖాతాలను ఫ్రీజ్‌ చేసినట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ కథనం వెల్లడించింది. ఖాతాలు స్తంభించడం వల్ల ఈ ఫండ్స్‌ పాత సెక్యూరిటీలని అమ్మడం లేదా కొత్త సెక్యూరిటీలను కొనుగోలు చేయడానికి అవకాశం ఉండదు. అయితే ఈ విషయంపై అదానీ గ్రూప్ స్పందించింది. ఎకనమిక్ టైమ్స్‌లో వచ్చిన ఆర్టికల్స్‌లో ఎలాంటి నిజాలు లేవని కొట్టిపారేసింది. ఇన్వెస్టింగ్ కంపెనీలను తప్పుదోవ పట్టిస్తోందని ఫైర్ అయ్యింది. కంపెనీకి ఉన్న పేరు, ప్రతిష్టలను దెబ్బ తీస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.