ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: గోవధపై ఎంఐఎం నేత ఆవేదన

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: గోవధపై ఎంఐఎం నేత ఆవేదన

గో వధకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆధిత్యనాధ్ ఆర్డినెన్స్ జారీ చేశారు. సీఎం యోగి ఆదిత్య నాథ్ అధ్యక్షతన యూపీ మంత్రి వర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  గో రక్షణ ఆర్డినెన్స్ ముసాయిదాను మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గో వధకు పాల్పడిన నిందితులకు పది సంవత్సరాల జైలు శిక్ష, 5లక్షల   జరిమానా విధిస్తున్నట్లు ఆర్డినెన్స్ లో పేర్కొంది. దీంతో పాటు గోవుల్ని హింసించి ప్రమాదంలోకి నెట్టేసిన నిందితులకు 1ఏడాది నుంచి 7సంవత్సరాల వరకు జైలు శిక్ష రూ. లక్ష నుండి 3 లక్షల వరకు జరిమానా, గోవులు అంగవైకల్యానికి కారణమైన నిందితులకు   10 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ .5 లక్షల జరిమానా విధిస్తున్నట్లు యూపీ సీఎం తెలిపారు.

ఈ ఆర్డినెన్స్ అమలుపై  అస్సాం ఎంఐఎం నేత సయ్యద్ అసీం వకార్ స్పందించారు. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి తో పాటు బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్య మంత్రులందర్నీ కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలు ఇవ్వని గోవుల్ని అమ్ముకుంటూ వాటిని వధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  అలాంటి వారిని శిక్షించడమే కాదు రూ.20 లక్షల జరిమానా విధించాలని డిమాండ్ చేశారు. గోవుల్ని రక్షించడంలో కేంద్రం, యూపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

గోవుల్ని అమ్మకం దారుల వద్ద కొనుగోలు చేసి, గో శాలల్ని ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాలకు చెందిన బీజేపీ ముఖ్యమంత్రులను కోరారు. అంతేకాదు గోవులు వీధుల్లో తిరుగుతూ ప్లాస్టిక్ ను తింటున్నాయని, మురుగు నీటిని తాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.