కట్టు తప్పుతున్న ఖాకీలు

కట్టు తప్పుతున్న ఖాకీలు

నల్గొండ జిల్లాలో పోలీసులపై అవినీతి ఆరోపణలు
నల్గొండ, వెలుగు : చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే అవినీతి, అక్రమాలతో అభాసుపాలవుతున్నారు. కొంత కాలంగా నల్గొండ జిల్లాలో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు ఆ శాఖకు మాయని మచ్చగా మారుతోంది. అక్రమాలకు పాల్పడడం, ఇల్లీగల్ దందాలో పాలు పంచుకోవడం వంటి మేజర్ ఇష్యూస్ తో పాటు, చిన్నాచితక తప్పులతో అడ్డంగా దొరికిపోతున్నారు. పోలీసుల వైఖరి పట్లపెరుగుతున్న ఫిర్యాదులే వాళ్ల పనితీరును బహిర్గ‌తం చేస్తున్నాయి. గడిచిన 30 నెలల్లోనే నల్గొండ జిల్లాలో 32 మంది పోలీసులపైన సస్పెన్షన్ వేటు పడింది. ఇందులో ఎక్కువగా ఎస్ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లే ఉన్నారు. ఇక చిన్న చిన్నతప్పుల విషయంలో కానిస్టేబుల్నుంచి సీఐల వరకు దొరికిపోతున్నారు. దీంతో పోలీసుల ప్రవర్తనలో మార్పు తీసుకొచ్చేందుకు ఎస్పీ ఏవీ రంగనాథ్ క‌ఠినంగానే వ్యవహరిస్తున్నప్పటికీ… పొలిటికల్ స‌పోర్ట్ తో కొందరు బయట పడుతున్నారు.

40 ఏళ్ల లోపు వారే ఎక్కువ

ప్రజలు ఎలాంటి తప్పు చేసినా సరిదిద్దాల్సిన పోలీసులే అవినీతికి పాల్పడుతున్నారు. ఇందులో సీనియర్ ఆఫీసర్ల‌తో జూనియర్లు పోటీ పడుతున్నారు. కొత్తగా ఉద్యోగాల్లో చేరి పది, పన్నెండేళ్ల సర్వీసు కూడా పూర్తి చేసుకోని ఎస్ ఐలు, కానిస్టేబుళ్లే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటివరకు తప్పులు చేసి దొరికి పోయిన వాళ్ల ఏజ్ 40 ఏళ్ల లోపే ఉంటోందని ఆఫీసర్లు చెబుతున్నారు. వీళ్ల సర్వీసు 5 నుంచి 12 సంవత్సరాల మధ్యలో ఉంటుందని అంటున్నారు. ప్రోబేషనరీ పీరియడ్ దాటాక రెగ్యులర్ డ్యూటీలో చేరిన తక్కువ టైంలోనే కానిస్టేబుళ్లు, ఎస్ఐలు వివిధ రకాల ప్రలోభాలకు లోనవుతున్నట్లు ఉన్నతాధికారుల విచారణలో తేలింది. చిన్నా, చితక తప్పులే కాకుండా క్రిమినల్ కేసుల్లో ఇన్వాల్వ్ కావడం, మధ్యవర్తులను అడ్డంపెట్టుకుని అక్రమ వసూళ్లు చేయడం, ఇల్లీగల్ దందాలకు తెరవెనక పాత్ర పోషించడం, డ్యూటీ పట్ల నిర్ల‌క్ష్యం వంటి అనేక ఆరోపణలతో ఎంక్వైరీని ఫేస్ చేయాల్సి వస్తోంది. ఈ క్రమంలో తప్పు చేసినట్లు తేలిన పోలీసులపై కఠిన చర్యలే తీసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఎవరికీ ఎలాంటి మినహాయింపులు ఇవ్వకుండా వచ్చిన ఆరోపణలు వచ్చినట్టుగానే ఎస్పీ ఎంక్వైరీ చేస్తున్నారు. దీంతో గతంతో పోలిస్తే ప్రస్తుతం పోలీసుల తప్పుల లిస్ట్ త‌గ్గిన‌ట్లుగానే కనిపిస్తోంది. కానీ మైనర్ల త‌ప్పుల విషయంలో మాత్రం ఫిర్యాదులు ఆగడం లేదు.

మేజర్ తప్పులతో దొరికిపోయి…

మేజర్ తప్పులతో దొరికిపోయిన ఇద్దరు కానిస్టేబుళ్ల‌ను డిస్మిస్ చేశారు. మరో పది మంది కానిస్టేబుళ్లు ఉద్యోగాలు కోల్పోయారు. 37 మంది కానిస్టేబుళ్లు, ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్ల‌కు ఏడాది పాటు ప్రమోషన్ రాకుండా పన్మిషెంట్ విధించారు. ఇద్దరు కానిస్టేబుళ్లు టైంస్కేల్ కోల్పోగా, మరో కానిస్టేబుల్ ఏడాది పాటు ఇంక్రిమెంట్ కోల్పోయారు. మరో 27 మంది కానిస్టేబళ్లు పైన వచ్చిన ఆరోపణలు రుజువు కాలేదు.