రోబోల్లో రక్తం నింపుతున్నరు!

రోబోల్లో రక్తం నింపుతున్నరు!

మనుషులకు సాధ్యం కానీ పనుల్ని రోబోలు చేస్తున్నాయ్‌‌.  కానీ,  మనుషులు చేసేంత సేపు మాత్రం చేయలేకపోతున్నాయి.  అందుకు కారణం వాటిలో ఎనర్జీ లెవల్స్‌‌ తక్కువగా ఉండటం.  అంటే బ్యాటరీ అయిపోగానే అవి పని చేయడం ఆగిపోతుందన్న మాట. అదే మనిషిలో ఐతే ప్రతీ పార్ట్‌‌ పని చేసేందుకు రక్తం సాయపడుతుంది.  కానీ, రోబోలో అలాంటి వ్యవస్థ ఉండదు కదా!. కానీ, ఇక ముందు అలాంటి రక్తప్రసరణ వ్యవస్థలు రోబోల్లోనూ చూడబోతున్నాం.

అమెరికా, కార్నెల్‌‌ యూనివర్సిటీ పరిశోధకులు రీసెంట్‌‌గా రక్తప్రసరణ వ్యవస్థలాంటి మెకానిజంతో ఓ రోబో లయన్‌‌ ఫిష్‌‌ను తయారు చేశారు. పెన్విల్వేనియా యూనివర్సిటీ అసిస్టెంట్‌‌ ఫ్రొఫెసర్‌‌ జేమ్స్‌‌ పీకూ ఆ రోబో ఫిష్‌‌ రూపకర్త. నీళ్లలో ఎక్కువసేపు ఉండేలా దానిలో ఒక స్పెషల్ వ్యవస్థను రూపొందించారు.  ఈ రోబో ఫిష్‌‌ స్ఫూర్తితోనే ఇప్పుడు హ్యుమనాయిడ్ రోబోలను తయారు చేయబోతున్నారు.  ఈ ప్రయోగాలు సక్సెస్‌‌ అయితే ఎక్కువ రోజులు పని చేసే రోబోలు మన ముందుకు వస్తాయి.

ఎట్ల పని చేస్తదంటే..
రోబోలో బ్యాటరీకి అనుసంధానంగా కృత్రిమ నాళాల వ్యవస్థ ఉంటుంది. దీంట్లో రోబోకు ఎనర్జీ అందించే హైడ్రాలిక్‌‌ లిక్విడ్‌‌ను(రోబో బ్లడ్‌‌) నింపుతారు.  రోబోకి ఉండే బ్యాటరీ డౌన్‌‌ అయిపోగానే..  రోబో బ్లడ్‌‌ ప్రవాహం ద్వారా కావాల్సిన ఎనర్జీ అందుతుంది.  దాంతో రోబో పని చేయడం ఆగదు. ప్రస్తుతం ప్రయోగ దశల్లో ఉన్న ఈ పరిశోధనలు పాజిటివ్ రిజల్ట్స్‌‌ ఇచ్చాయని కార్నెల్‌‌ యూనివర్సిటీ అసోషియేట్‌‌ ఫ్రొఫెసర్‌‌ రాబ్‌‌ షెఫర్డ్‌‌ చెబుతున్నాడు. సైంటిఫిక్‌‌ మెషీన్లకు, సముద్ర గర్భంలో పరిశోధనలకు, గ్రహాంతర అన్వేషణలకు ఈ బ్లడ్‌‌ రోబోలు ఉపయోగపడతాయని ఆయన అంటున్నాడు.