కామారెడ్డిలో క్రాస్ ఓటింగ్ పైనే ఆశలు

కామారెడ్డిలో క్రాస్  ఓటింగ్ పైనే  ఆశలు
  •       కామారెడ్డిలో పెరిగిన పోలింగ్
  •     గెలుపు పై కాంగ్రెస్, బీజేపీ ఆశలు 

కామారెడ్డి, వెలుగు : జహీరాబాద్ పార్లమెంట్ స్థానంపై ప్రధాన పార్టీలు ఆశలు పెట్టుకున్నాయి. గత పార్లమెంటు ఎన్నికల కంటే పోలింగ్ శాతం పెరగడం ఎవరికి అనుకూలం, ఎవరికి నష్టం అనే విషయంపై పొలిటికల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.  మరో వైపు క్రాస్ ఓటింగ్ గెలుపు, ఓటమిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.  జహీరాబాద్ స్థానం పరిధిలో మొత్తం 16,41,410 మంది ఓటర్లు ఉన్నారు.  

సోమవారం జరిగిన ఎన్నికల్లో 12,25,049 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  74.63 శాతం పోలింగ్ నమోదైంది.  2019 ఎన్నికల్లో 69.79 శాతం పోలింగ్ జరిగింది.  4.90 శాతం ఓటింగ్ పెరిగింది. 

ఎల్లారెడ్డి లో అత్యధిక పోలింగ్

 కామారెడ్డి జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఇక్కడ మొత్తం 8,77,747 మందికి గాను 6,60,624  మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.  సంగారెడ్డి జిల్లాలోని  3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 7,63,647 మంది ఉంటే ఇందులో  5,64,925 మంది ఓటు వేశారు.  మొత్తం 7  నియోజకవర్గాల్లో ఎల్లారెడ్డి నియోజక వర్గంలో ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఎల్లారెడ్డిలో 2,23,027 మందికి గాను 1,72,928 మంది (77.54 శాతం)  ఓటు వేశారు.  

కామారెడ్డి లో 2,55,007 మందిలో 1,82,325 మంది (71.50 శాతం),  జుక్కల్ లో 2,02,887 ఓటర్లకు గాను 1,53,855 మంది (75.83 శాతం) , బాన్సువాడ లో 1,96,826 మందిలో 1,51,516  మంది 76.98 శాతం ఓట్లు వేశారు.  ఆయా నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గింది. కాగా బీజేపీ, కాంగ్రెస్ లు తమదే విజయమని చెప్పుకుంటున్నాయి.

 గెలుపు పై ఎవరి ధీమా వారిదే

గెలుపుపై ప్రధాన పార్టీలు ధీమాగా ఉన్నాయి.   సురేశ్ షెట్కార్( కాంగ్రెస్), బీబీ పాటిల్( బీజెపీ), గాలి అనిల్ కుమార్ (బీఆర్‌‌ఎస్ ) తో పాటు మొత్తం 19 మంది పోటీ చేశారు.  మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు.  కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ రెండు పార్టీలు గెలుపుపై గట్టి ధీమాతో ఉన్నాయి.  కామారెడ్డి జిల్లాలో క్రాస్ ఓటింగ్ జరిగింది.  క్రాస్ ఓటింగ్ ఆయా పార్టీల అభ్యర్థుల గెలుపు ఓటముల పై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.  

ఈ ఎన్నికల్లో యూత్, మహిళలు , వృద్ధులు ఎక్కువ సంఖ్యలో ఓటు వేశారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రధానంగా క్రాస్ ఓటింగ్ జరిగిందని ప్రచారం ఉంది.  అసెంబ్లీ ఎన్నికల్లో  ఓ పార్టీ కి ఓటు వేసిన చాలా మంది ఓటర్లు పార్లమెంట్ ఎలక్షన్ లో మరో పార్టీ వైపు ఆసక్తి చూపారనే చర్చ స్థానికంగా జరుగుతోంది. ఆయా పార్టీల నేతలు, అభ్యర్థులు మాత్రం  తమదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.