కామారెడ్డి, కామారెడ్డి టౌన్, వెలుగు: కామారెడ్డి మున్సిపల్ ఆఫీసులో సోమవారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ నగేశ్గౌడ్ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన తనిఖీలు రాత్రి వరకు కొనసాగాయి. ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరినీ ఆఫీసు నుంచి బయటకు పంపలేదు. ఆయా విభాగాల్లో పలు అక్రమాలను ఏసీబీ అధికారులు గుర్తించారు.
కొందరు అధికారులు తనిఖీల సమయంలో ఆఫీసులో లేరు. ప్రధానంగా టౌన్ఫ్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ విభాగాల్లో అక్రమాలు జరిగినట్లు తేల్చారు. మున్సిపల్ అధికారుల వాహనాలకు వినియోగించే ఇంధన చెల్లింపులకు సరైన రికార్డులు లేవు. ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ నెలలో కొన్ని రోజులు డ్యూటీకి గైర్హాజరైనట్లు రిజిస్టర్లో ఎంట్రీ చేశారు. కానీ రికార్డులు పరిశీలిస్తే పూర్తి జీతాన్ని క్లెయిమ్ చేసినట్లు అధికారుల ఎంక్వైరీలో తేలింది. ఆయా విభాగాల్లో గుర్తించిన లోపాల నివేదిక ప్రభుత్వానికి సిఫార్స్ చేయనున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
