క‌రోనా భ‌యంతో ఆస్ప‌త్రిలో చేర్చుకునేందుకు నో.. పెళ్లికి ముందు ప్రాణాలు వ‌దిలిన 19 ఏళ్ల‌ వ‌ధువు

క‌రోనా భ‌యంతో ఆస్ప‌త్రిలో చేర్చుకునేందుకు నో.. పెళ్లికి ముందు ప్రాణాలు వ‌దిలిన 19 ఏళ్ల‌ వ‌ధువు

క‌రోనా భ‌యంతో సీరియ‌స్ కండిష‌న్‌లో ఉన్నా ఆస్ప‌త్రిలో చేర్చుకోక‌పోవ‌డంతో 19 ఏళ్ల వ‌ధువు పెళ్లికి కొద్ది నిమిషాల ముందు ప్రాణాలు వ‌దిలింది. ఈ విషాద ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని క‌నౌజ్ జిల్లాలోని భ‌గ‌వ‌త్‌పురాలో జ‌రిగింది. శుక్ర‌వారం రాత్రి భ‌గ‌వ‌త్‌పురాకు చెందిన వినిత (19) వివాహం చేసేందుకు త‌ల్లిదండ్రులు ముహుర్తం నిశ్చ‌యించారు. సంప్ర‌దాయం ప్ర‌కారం పెళ్లికి ముందు జ‌రిగే వేడుక‌ల్లో పాల్గొనేందుకు పెళ్లికొడుకు సంజ‌య్, కుటుంబ‌స‌భ్యుల‌తో క‌లిసి కొన్ని గంట‌ల ముందే అమ్మాయి ఇంటికి చేరుకున్నాడు. ఇళ్లంతా పెళ్లి సంబ‌రంలో ఉన్న స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి పెళ్లి కూతురు ఉన్న‌ట్టుండి అస్వ‌స్థ‌త‌కు గురైంది. ఒక్క‌సారిగా కుప్ప‌కూలిపోయింది. దీంతో కుటుంబ‌స‌భ్యులు హుటాహుటీన వినిత‌ను సమీపంలోని ఆస్ప‌త్రికి తీసుకెళ్లారు. కానీ ఆమెకు క‌రోనా ఉందేమోన‌న్న భయంతో ఆస్ప‌త్రిలో చేర్చుకునేందుకు సిబ్బంది ఒప్పుకోలేదు. క‌రోనా నెగ‌టివ్ రిపోర్టు ఉంటేనే హాస్పిట‌ల్‌లో చేర్చుకుంటామ‌ని చెప్పారు. దీంతో ఏం చేయాలో అర్థం కాక వెంట‌నే ఆమెను తీసుకుని కాన్పూర్ ప్ర‌యాణ‌మ‌య్యారు. కానీ అప్ప‌టికే ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆమె మార్గ మ‌ధ్యంలోనే ప్రాణాలు వ‌దిలింది. దీంతో జ‌రిగిన విష‌యాన్ని కనౌజ్ పోలీసుల‌కు తెలిపారు వినిత కుటుంబ‌స‌భ్యులు. ఆమె మృత‌దేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి త‌ర‌లించారు. అనంత‌రం శ‌నివారం ఆమె మృత‌దేహాన్ని కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించారు. ఎంతో సంబ‌రంగా కూతురి పెళ్లి చేద్దామ‌నుకున్న వినీత త‌ల్లిదండ్రులు.. గుండెల‌విసిపోయే విషాదంతో ఆమె అంత్య‌క్రియ‌లు పూర్తి చేశారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌ని, పోస్టుమార్టం రిపోర్టు రావాల్సి ఉంద‌ని క‌నౌజ్ పోలీసులు తెలిపారు. అవ‌స‌ర‌మైతే ఆస్ప‌త్రి సిబ్బందిపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్పారు.